వారిద్దరు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఇంటర్ వరకు కలసి చదువుకున్నారు. అనంతరం ఒకరు బీఎస్సీ, మరొకరు ఇంజనీరింగ్ వైపు వెళ్లారు. చదువులో మార్గం వేరైనా.. ఇద్దరు నిత్యం కలుసుకుంటుండేవారు. ఏమైందో తెలియదు.. ఈ ఇద్దరు యువతులు రైలు కిందపడి అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఏపీలోని అనంతపురం జిల్లా యాడికి చెందిన పూజిత(19), కల్యాణి(19) మంచి స్నేహితులు. చిన్నతనం నుంచి ఇంటర్ వరకు ఇద్దరు ఒకే స్కూల్, కాలేజిలో చదువుకున్నారు. ప్రస్తుతం పూజిత తాడిపత్రిలో బీఎస్సీ మొదటి సంవత్సం చదువుతోంది. కల్యాణి గుత్తిలోని గేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది. అయిన వారు నిత్యం కలుసుకుంటూ.. వారి చదువుల సంగతులు, ఇతర విషయాలను షేర్ చేసుకుంటూ ఉండేవారు.
ఇలా సాగుతున్న ఈ స్నేహితులకు ఏమైందో ఏమో కానీ.. కడప రైల్వే స్టేషన్ పరిధిలోని బాక్రా రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతిచెందారు. ఘటనా స్థలాన్ని కడప రైల్వే పోలీసులు పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.