ఆమె పేరు గంగాదేవి. అనంతపురం జిల్లా తిమ్మంపల్లికి చెందిన ఈమెకు తుట్రాళ్లపల్లికి చెందిన గుర్రప్పతో 2009లో వివాహం జరిగింది. కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె జన్మించారు. కాగా భర్త గుర్రప్ప లారీ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. దీంతో వీరి కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా సాగుతున్న తరుణంలోనే భార్యాభర్తల మధ్య గతేడాది కలహాలు మొదలయ్యాయి.
ఇక భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్య గతేడాది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కన్నీరు మున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు అనంతరం అంత్యక్రియలు జరిపారు. ఇదిలా ఉంటే ఐదు నెలల క్రితం గుర్రప్ప మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గంగాదేవి తల్లి సుంకాలమ్మ గుర్రప్పతో తాము ఇచ్చిన కట్నకానుకల విషయంలో గొడవ చేసింది. దీంతో భర్తే మా కూతురిని చంపాడన్న కోణంలో సుంకాలమ్మ పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది.
సుంకాలమ్మ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు శ్మశానానికి వెళ్లి గంగాదేవిని పాతిపెట్టిన ప్రాంతంలో తవ్వి చూశారు. కానీ ఈ ప్రదేశంలో పాతిపెట్టిన గంగాదేవి మృతదేహం కనిపించలేదు. దీంతో గంగాదేవి తల్లిదండ్రులకు అనుమానం మరింత బలపడింది. ఇక ఏం చేయాలో తెలియక పోలీసులు, రెవన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎలాగైన గంగాదేవి మృతదేహాన్ని వెతికిపట్టేందుకు అధికారులు అన్వేషణ మొదలు పెట్టారు. తాజాగా అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.