నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. కానీ కొంతమంది వారిని చెడగొడుతున్నారు. సమాజం పట్ల స్వార్థపరులుగా తీర్చిదిద్దుతున్నారు. చిన్నతనంలోనే వారి మెదడులో విషం నింపుతున్నారు. ఒక 13 ఏళ్ల బాలుడు బ్యాంకు రాబరీకి యత్నించేలా ఉసికొల్పారు.
స్నేహితులతో ఆడుకునే వయసులో 13 ఏళ్ల బాలుడు బ్యాంకు దొంగతనానికి వచ్చాడు. చీకటి అంటే భయపడే వయసు అది. అయినా భయపడకుండా గడ్డపారతో బ్యాంకుకి కన్నం వేయడానికి వెళ్ళాడు. పిల్లలకు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. క్రమశిక్షణగా పెంచకపోతే సమాజం నేర్పుతుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని సక్రమంగా పెంచాలి. లేదంటే చిన్నప్పటి నుంచి రౌడీల్లా, దొంగల్లా తయారవుతారు. తాజాగా ఓ బాలుడు దొంగతనానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని భారతీయ స్టేట్ బ్యాంకు శాఖలో బుధవారం రాత్రి చోరీకి యత్నించినట్లు పోలీసులకు సమాచారం అందింది. గుర్తు తెలియని దుండగులు చేసి ఉంటారేమో అన్న అనుమానంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా షాక్ అయ్యారు.
ఎందుకంటే దొంగతనానికి వచ్చింది పెద్ద వాళ్ళు కాదు. ఏడో తరగతి చదువుతున్న ఒక చిన్న బాలుడు. ఇర్సులాపురం గ్రామానికి చెందిన బాలుడు ఎస్బీఐ బ్యాంక్ లోకి గడ్డపారతో ప్రవేశించాడు. బ్యాంకు వెనుక వైపు నుంచి వెళ్లి గ్రిల్స్ తలుపు తాళం పగులగొట్టి బ్యాంకు లోపలకు వెళ్ళాడు. అయితే బ్యాంకు డెస్క్ లోన్ డబ్బులు, నగలు ఉంటాయేమో అని చాలా సేపు వెతికాడు. చివరకు ఏమీ దొరక్కపోవడంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. గురువారం ఉదయం స్వీపర్ గా పని చేసే పద్మ అనే మహిళ.. బ్యాంక్ తాళం పగులగొట్టి ఉండడం చూసి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే చేరుకొని సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. రాత్రి 8:20 గంటలకు బాలుడు బ్యాంకులోకి ఒంటరిగా ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు పోలీసులు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలుడ్ని ఇర్సులాపురంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే 13 ఏళ్ల వయసున్న బాలుడు ఒక్కడే ఈ దొంగతనానికి పాల్పడే అవకాశం లేదని.. ఎవరి ప్రమేయం లేకుండా ఒక్కడే ఇక్కడి దాకా వచ్చి ఉండడని పోలీసులు భావించారు. గడ్డపారతో చప్పుడు చేయకుండా తాళం పగులగొట్టడం అంత సులువు కాదని.. ఎవరైనా డైరెక్షన్ ఇచ్సి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. బాలుడితో ఎవరైనా ఇలా చేయించారా? అని ప్రశ్నించగా బాలుడు అసలు నిజం చెప్పాడు. ఓ పాత నేరస్తుడి ప్రోద్బలంతో బాలుడు దొంగతనానికి పాల్పడినట్లు చెబుతున్నారు. బ్యాంక్ వెనుక వైపు నుంచి తనను గోడపైకి ఎక్కించి.. ఆ పాత నేరస్తుడు బయటే నక్కి ఉన్నాడని.. బాలుడు బయటకు వచ్చే వరకూ అతను అక్కడే ఉన్నాడని పోలీసుల విచారణలో బాలుడు వెల్లడించాడు. బాలుడు బయటికొచ్చిన తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయినట్లు బాలుడు వెల్లడించాడు. పాత నేరస్తుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.