ఎప్పుడూ ఏ ప్రాంతం ఒకేలా ఉండదు. ముఖ్యంగా భూమి ధరలు ఒకేలా ఉండవు. కాలం మారే కొద్దీ ధరలు మారుతుంటాయి. మద్రాస్ నుంచి విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అయ్యింది. తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు ఆ అవకాశం ఏపీకి వచ్చింది. అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే వాటిలో సినీ రంగం ఒకటి. అలాంటి సినీ రంగం ఏపీకి వస్తే నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఏపీకి సినీ రంగం అనేది వస్తుంది. మరి ముందుగానే భూములు కొని పెట్టుకుంటే బాగుంటుంది కదా. అసలు సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి భూములు ఇస్తుంది?
ఏపీ, తెలంగాణ విడిపోయాక ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ కే పరిమితమైపోయింది. ఏపీలో 40 శాతం షూటింగులు జరుగుతున్నాయి. అయితే షూటింగులు జరగడం కంటే.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏపీలో ఉంటే బాగుంటుందని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. సినిమా ఇండస్ట్రీని వైజాగ్ కి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీకి తన సపోర్ట్ ఫుల్ గా ఉంటుందని, వైజాగ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం కేటాయించిన 300 ఎకరాల్లో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు. ఏపీలో సినీ పరిశ్రమను డెవలప్ చేయాలన్న ఆలోచనను ముందుకు తీసుకెళ్లే విధంగా ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నటుడు పోసాని కృష్ణమురళిని నియమించారు.
ఏపీలో నంది అవార్డులను అందజేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. ఈ బాధ్యతను పోసాని కృష్ణమురళికి అప్పజెప్పారు. ఏపీలో ఎవరైనా షూటింగ్ చేసుకోవచ్చునని.. స్టూడియోలు కట్టుకుంటే ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని జగన్ చెప్పారు. సినిమా రంగం అభివృద్ధి కోసం ఎలాంటి సహాయం కావాలన్నా జగన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వైజాగ్ కి ఫిల్మ్ ఇండస్ట్రీని తరలించేందుకు సినిమా వాళ్ళు కూడా ఆసక్తిగానే ఉన్నారు. సినిమా వాళ్ళ కోసం సెపరేట్ గా ఉండడానికి ఇళ్ల స్థలాలు, స్టూడియోల కోసం స్థలాలు కేటాయిస్తామని జగన్ అన్నారు. ఏపీలో నంబర్ వన్ ఫిల్మ్ ఇండస్ట్రీని నిర్మించాలన్న దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది.
ఫ్యూచర్ లో రామోజీ ఫిల్మ్ సిటీ తరహాలో ఒక ఫిల్మ్ సిటీ వచ్చే అవకాశం లేకపోలేదు. చెన్నై నుంచి హైదరాబాద్ కి ఎలా అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చిందో అలా హైదరాబాద్ నుంచి ఏపీకి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ తరలి వెళ్లే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే.. ఫిల్మ్ ఇండస్ట్రీ పాపులర్ ఏరియాలు, డిమాండ్ ఉన్న ఏరియాల్లో రాదు. అది వచ్చిన తర్వాత ఆ ఏరియాలే డెవలప్ అవుతాయి. ఒకప్పుడు ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో కొండలు తప్ప ఏం లేవు. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉన్నారు. అప్పట్లో కొండల్లో భూమిని కొన్నవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు.
అలానే ఇప్పుడు వైజాగ్ లో కూడా అభివృద్ధి లేనటువంటి ప్రాంతాల్లో మాత్రమే స్థలాలను కేటాయిస్తారు. బాగా తక్కువ ధర పలికే స్థలాలను మాత్రమే ఇండస్ట్రీకి ఇస్తారు. అలాంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఇప్పుడు స్థలాలను కొన్నట్లైతే భవిష్యత్తులో ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వైజాగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్ గా ఏర్పడితే కనుక వైజాగ్ లో ఉన్న అన్ని ఏరియాల్లో స్థలాల రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. వెంటనే కాకపోయినా రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.