బట్టలు ఉతికే లాండ్రీలను చూసి ఉంటారు. కానీ బూట్లు ఉతికే లాండ్రీని చూశారా? బీహార్‌లోని పాట్నాకు చెందిన షాజియా కైసర్ అనే మహిళకు బూట్లు ఉతికే లాండ్రీ వ్యాపారం ఉంది. ఈ లాండ్రీలో మాసిపోయిన బూట్లను శుభ్రంగా ఉతికి ఇస్తారు. పాత బూట్లను కొత్తగా మెరిసేలా చేయడంలో ఈమె ఎక్స్పర్ట్. ఈ లాండ్రీలో బూట్లను ఉతకడంతో పాటు షూలు లెదర్ జాకెట్లు, లెదర్ బ్యాగ్‌లు కూడా రిపేర్ చేస్తున్నారు. పాడైపోయిన షూలు, లెదర్ బ్యాగ్స్ గానీ, లెదర్ జాకెట్లు గానీ పట్టుకెళ్తే.. శుభ్రం చేసి కొత్తగా చేయడం వీరికున్న అడిషనల్ స్కిల్స్. వీరి షాపులకి వెళ్ళిన ఏ కస్టమర్ కూడా డిజప్పాయింట్ అవ్వరు. అంతలా కస్టమర్‌కి తమ సర్వీస్‌లతో సంతృప్తినిస్తారు.
ఇప్పుడు ఈమె బిజినెస్ చాలా బాగా రన్ అవుతోంది. ఈమెకు పాట్నాలో 5 లాండ్రీ షాపులు ఉన్నాయి. మొత్తం 12 మంది షాజియా దగ్గర పనిచేస్తున్నారు. రివైవల్ అనే పేరుతో ఈమె తన బిజినెస్‌ను రన్ చేస్తున్నారు. రివైవల్ సర్వీసెస్ పేరుతో ఒక వెబ్ సైట్ కూడా ఉంది. వెబ్ సైట్లో అపాయింట్మెంట్ తీసుకుంటే నేరుగా ఇంటికి వచ్చి వస్తువులని పికప్ చేసుకుంటారు. సర్వీస్ అయ్యాక తిరిగి ఇంటికి తీసుకొస్తారు.
2014లో ఆమె ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. మొదట్లో కొంతమంది తొడుక్కోవడానికి పనికిరాని బూట్లని తీసుకొచ్చి ఇచ్చేవారని, అయితే వాటిని కస్టమర్లు వేసుకునే విధంగా రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళమని, ఆ విధంగా నమ్మకం సంపాదించుకున్నామని షాజియా అన్నారు. ఫిజియోథెరపీ చేసిన షాజియా బాగా ఆలోచించే ఈ వ్యాపారాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఒకవేళ బిజినెస్ సక్సెస్ కాకపోతే ఫిజియోథెరపీ చేయాలని అనుకున్నారట. అయితే అదృష్టం కొద్దీ వ్యాపారం సక్సెస్ అయ్యింది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు కార్పొరేట్ స్థాయికి ఆమె ఎదిగారు. తన కుటుంబం నుంచి వ్యాపార రంగంలో అడుగుపెట్టిన మొదటి మహిళ ఈమెనే. ఈ లాండ్రీ పెట్టినప్పుడు అనేక ప్రశ్నలు ఎదురయ్యాయని అన్నారు.
అయితే పట్టుదలతో తన పని తాను చేసుకుంటూ పోయానని అన్నారు. క్రమేణా ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని ఆమె అన్నారు. మొదట్లో తనను ఆడది కదా, ఏం చేయగలదులే అనుకున్నారని కానీ తన పనితనం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారని అన్నారు. పట్టుదల, అంకితభావంతో పనిచేస్తే కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తారని, నైపుణ్యం ఉంటే మహిళలైనా, పురుషులైనా విజయం సాధించవచ్చని అన్నారు. మరి వినూత్నంగా ఆలోచించి షూ లాండ్రీని రన్ చేస్తున్న ఈ మహిళపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
బట్టల లాండ్రీ తెలుసు.. బూట్లు ఉతికే లాండ్రీ వ్యాపారం గురించి తెలుసా?
#shoes #Business #Laundry pic.twitter.com/98VuFOUAka— BBC News Telugu (@bbcnewstelugu) August 8, 2022