ఇప్పటికే పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, నిత్యవసరాల ధరలకు తోడు డిజిటలైజేషన్‌తో మన నిత్యజీవితంలో భాగమైన మనీ ట్రాన్సాక‌్షన్ యాప్‌లు కూడా సామాన్యుడి నడ్డి విరేచేందుకు సిద్ధమయ్యాయి. పెట్రోలు, డీజిల్ ధరలు సెంచరీ కొట్టేసి రూ.120 మార్క్ చేరుకునేందుకు పరుగుపెడుతున్నాయి. ఇదే బాటలో ప్రైవేటు రంగంలోని డీటీహెచ్, ప్రైమ్ వీడియోల సబ్‌స్క్రిప్షన్స్ రేట్లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఫోన్‌పే వచ్చి చేరింది. ఇంత కాలం ఉచితంగా అందించిన సర్వీసులకు యూజర్ ఛార్జీలను చేర్చింది. వినియోగదారులకు నేరుగా ఈ విషయం చెప్పకుండానే బాదుడు మొదలు పెట్టింది.
ఇప్పటి వరకు ఫోన్‌పే ద్వారా బ్యాంకు చెల్లింపులు, గ్యాస్ బుకింగ్, మనీ ట్రాన్స్‌ఫర్, మొబైల్ రీఛార్జ్ వంటి సేవలన్నీ ఉచితంగా అందేవి. అయితే ఇటీవల పెద్దగా హడావుడి చేయకుండానే యూజర్ ఛార్జీల విధానాన్ని ఫోన్‌పే ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా మొబైల్ రీఛార్జీల విషయంలో వినియోగదారుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తోంది. రూ.50పైన రీఛార్జీ చేస్తే ఒక రూపాయి యూజర్ సర్వీస్ ఛార్జ్‌ని వసూలు చేస్తోంది. 100కు మించి ఉన్న రీఛార్జ్‌లకు రెండు రూపాయల వంతున యూజర్ ఛార్జీలుగా ఫోన్‌పే విధించింది. కాగా ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసరాల అధిక ధరలతో సతమతం అవుతుంటే ఇప్పుడు ఫోన్‌పే కూడా బాదుడు మొదలుపెట్టిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఫోన్‌పే తీరుపై అసంతృత్తిని వెల్లడిస్తున్నారు. మరి ఫోన్‌పే నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంతో తెలియజేయండి.