అక్షయ తృతీయను పురస్కరించుకుని.. జ్యువెలరీ స్టోర్స్ అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అలానే పాత బంగారం ఎక్స్‌చేంజ్ చేస్తే.. గ్రాము మీద మరి కొంత ఎక్స్‌ట్రా డబ్బలును చెల్లిస్తాం అని పేర్కొంటున్నాయి. అయితే పాత బంగారం ఎక్స్‌చేంజ్ విషయంలో.. షాపు యజమానులు.. కస్టమర్లను దారుణంగా మోసం చేస్తారని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఆ వివరాలు..
భారతీయులకు బంగారంతో విడదీయరాని అనుబంధం ఉంది. మన దేశంలో బంగారాన్ని లక్ష్మి దేవి స్వరూపంగా భావించి, పూజిస్తారు. అందుకే వివాహాది శుభకార్యల వేళ మాత్రమే కాక.. వరలక్ష్మి వ్రతం, ధన్‌తెరాస్, అక్షయ తృతీయ వంటి పర్వదినాల రోజుల్లో కూడా ఎంతో కొంత బంగారం కొంటే.. ఇక ఆ ఏడదంతా కలిసి వస్తుందని భావిస్తారు. ఇక గత కొన్నాళ్లుగా మన దగ్గర అక్షయ తృతీయ రోజున బంగారం కొనే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నగల దుకాణాదారులు.. రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఆభరణాల కొనుగులు పై ఫ్రీ గోల్డ్ కాయిన్స్, మేకింగ్ ఛార్జీలు, తరుగు మీద భారీ డిస్కౌంట్‌లను ప్రకటిస్తున్నాయి.
పాత బంగారం ఎక్స్‌చేంజ్ చేసి.. కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తే.. పాత బంగారానికి గ్రాము మీద ఎంతో కొంత ఎక్కువ ధరలను ప్రకటించే సంగతి తెలిసిందే. అయితే ఆఫర్లు ఉన్నాయి కదా అని.. వీటి గురించి ఏమాత్రం ఆలోచించకుండ.. తొందరపడి కొనుగోలు చేస్తే.. భారీగా నష్టపోతామని అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. మరీ ముఖ్యంగా పాత బంగారం ఎక్సేంజ్ చేసి.. కొత్త నగలు కొనే విషయంలో దుకాణాదారులు కస్టమర్లను మోసం చేసి భారీగా లాభాలు పొందుతారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇక్కడ ఎలాంటి మోసాలు జరుగతాయి అంటే..
ఫ్యాషన్‌లో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారుతుంటాయి. కొత్త కొత్త మోడల్స్, డిజైన్‌లు వెలుగులోకి వస్తాయి. దాంతో పాతవి మరుగున పడతాయి. కొత్తవి ట్రెండ్ అవుతాయి. చాలా మంది కొత్త డిజైన్ దుస్తులు ధరించడానికే ఆసక్తి చూపుతారు. పాతవాటిని ఓల్డ్ మోడల్ అంటూ పక్కకు పెడతారు. కానీ బంగారం విషయానికి వస్తే.. ఈ సీన్ రివర్స్ అవుతుంది. అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు వారి పెళ్లి కాలంలో కొన్న బంగారు ఆభరణాలను అట్టే దాచి.. వారసులకు బహుమతిగా ఇస్తారు. అయితే చాలా మంది వాటిని అలానే ధరించడానికి ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రం.. పాత నగలను ఎక్స్‌చేంజ్ చేసి కొత్త వాటినిన కొనుగోలు చేయాలని భావిస్తారు. ఇక నగల దుకాణాలు ఇలా పాత గోల్డ్ మీద ఎక్స్‌చేంజ్ ఆఫర్ ప్రకటించగానే.. పొలోమంటూ వెళ్లిపోతారు. అయితే కొన్ని చోట్ల పాత బంగారం ఎక్స్‌చేంజ్ చేసే సమయంలో కస్టమర్లు దారుణంగా మోసపోతుంటారు అంటున్నారు విశ్లేషకులు.
బంగారం స్వచ్ఛతను క్యారెట్‌లలో కొలుస్తారు. 24 క్యారెట్ గోల్డ్ అంటే.. మేలిమి బంగారం. అయితే ఇది కాస్త మృదువుగా ఉండటం వల్ల.. ఆభరణాల తయారీకి వినియోగించరు. పైగా ఇది 99. 9శాతం స్వచ్ఛంగా ఉంటుంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా 22 క్యారెట్ బంగారం వాడతారు. దీని స్వచ్ఛతం 22/24×100 అంటే 91.66 శాతంగా ఉంటుంది. దీనితోనే ఆభరణాలు తయారు చేస్తారు. మనం పాత బంగారాన్ని ఎక్స్‌చేంజ్ చేసే సమయంలో ఆభరణాల వ్యాపారులు కస్టమర్లను మోసం చేస్తారు. ఇప్పటికి చాలా నగల దుకాణాల్లో బంగారం స్వచ్ఛతను కొలిచే క్యారెట్ మీటర్లు లేవు. ఉదాహరణకు.. మనం పాత గోల్డ్ ఎక్స్‌చేంజ్‌కు తీసుకెళ్లాం. అది కూడా ఎప్పటితో బామ్మల కాలం నాటి ఆభరణాలు అనుకోండి. అప్పుడు నగల దుకాణాదారు తన షాప్‌లో ఉన్న స్వర్ణకారుడి సాయంతో మిమ్మల్ని బురిడీ కొట్టిస్తారు.
వారిద్దరూ మాట్లాడుకుని.. మిమ్మల్ని మోసం చేస్తారు. ఉదాహరణకు మీ పాత బంగారం నాణ్యత 23 క్యారెట్లు అయితే, దాన్ని ఎక్స్‌చేంజ్ చేసి.. కొత్త నగలు తీసుకునేట్టప్పుడు దుకాణాదారుడు.. మీ పాత బంగారాన్ని 22, 18 క్యారెట్‌లుగా మార్చుతారు. మీకు మస్కా కొట్టి.. అందులో ఇత్తడి, రాగి, ఏదైనా లోహం కలుపుతారు. ఇక్కడ మీరు తీసుకెళ్లిన మీ పాత బంగారం 10 గ్రాములు, 23 క్యారెట్లు అంటే 95.83 శాతం స్వచ్ఛమైనది అనుకుంంటే.. షాపు యజమాని, స్వర్ణ కారుడు ఇద్దరు కలిసి.. దాన్ని 18, 22 క్యారెట్లకు తగ్గిస్తారు.
ప్రస్తుతం 24 క్యారెట్ బంగారం ధర 60 వేల పైచిలుకు ఉంది. అలానే 22 క్యారెట్ బంగారం ధర 55 వేల రూపాయల పైన నడుస్తోంది. మీరు ఎక్స్‌చేంజ్‌కు తీసుకెళ్లిన బంగారం స్వచ్ఛత కేవలం 18 క్యారెట్స్ అని చెప్తాడు దుకాణాదారుడు. అలా దాని ధర తగ్గుతుంది. మీ వద్ద నుంచి 22 క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్ కొని.. మీకు మాత్రం 18 క్యారెట్ గోల్డ్ ధర కట్టిస్తాడు. ఇలా చేయడం వల్ల నగల దుకాణాదారుడికి ఎంత లేదన్న.. 8-10 వేల రూపాయల లాభం ఉంటుంది.
అలానే ఈమధ్యకాలంలో వన్ గ్రామ్ గోల్డ్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. అయితే దీనిలో కూడా కస్టమర్ ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. దీనిలో నగల షాపు వారికి ఏకంగా 5000 రూపాయల వరకు లాభం ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే.. దీనిలో బంగారం 1 గ్రాము మాత్రమే ఉన్న.. ఈ తరహా ఆభరణాలకు కూడా మేకింగ్ ఛార్జీలు వసూలు చేస్తారు నగల దుకాణాదారులు. ఇది దాదాపు రూ. 5,000 వరకు ఉంటుంది. ఇలా స్వర్ణకారులు, నగల దుకాణాల యజమానులు కస్టమర్‌లను మోసం చేస్తూ ఉంటారు.
బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడం కోసం భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు చోట్ల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫైడ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడం కోసం ఇక్కడ క్యారెట్ మీటర్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ యంత్రం బంగారాన్ని మూడు పొరల్లో పరీక్షించి దాని స్వచ్ఛతను క్యారెట్లలో చెబుతుంది. దేశవ్యాప్తంగా 950 బీఐఎస్ కేంద్రాలు ఉన్నాయి.
బీఐఎస్ వెబ్‌సైట్‌కి వెళ్లి.. మీకు సమీపంలో ఉన్న బీఐఎస్ కేంద్రాల జాబితాను చెక్ చేసుకుని అక్కడకు వెళ్లి మీ బంగారం స్వచ్ఛతను పరీక్షించుకోవచ్చు. కేవలం 35 రూపాయలు చెల్లించి.. మీ బంగారం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరే బంగారం స్వచ్ఛతను తెలుసుకుని.. ఆ తర్వాత షాప్‌కు వెళ్లి.. ఎక్స్‌చేంజ్ చేసుకుంటే.. మోసపోయే చాన్స్ లేదంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ సారి పాత బంగారం ఎక్స్‌చేంజ్ చేయాలనుకుంటే.. ఈమోసాలను.. దాన్ని అరికట్టే మార్గాలను తెలుసుకుని.. ఆ తర్వాత షాప్‌కి వెళ్లండి.