సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలకు ఇక చెల్లుచీటీ ఇస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది అంటే 2022 జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ది ప్రత్యేక స్థానం. ప్రజలకు అంతర్జాలాన్ని దగ్గర చేసిన ఘనత దీనికే దక్కుతుంది. ఇప్పుడు అది కాలగర్భంలో కలిసిపోనుంది. వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. దశలవారీగా దీని సేవలను నిలిపివేస్తామని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సేవలు భవిష్యత్తులో దీనిని సపోర్ట్ చేయవని వెల్లడించింది. అందుకు బదులుగా విండోస్ పీసీల్లో కేవలం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. మైక్రోసాఫ్ట్ సంస్థ 1995లో తన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో తొలిసారిగా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను అందించింది. తరువాత వచ్చిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలోనూ దీన్ని బండిల్‌గా కొనసాగించారు. అనేక సార్లు కొత్త వెర్షన్ అప్‌డేట్‌లను అందించారు. అయితే మొజిల్లా ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోమ్, ఓపెరా వంటి బ్రౌజర్లు ఎక్కువ పోటీని ఇవ్వడంతో ఆ పోటీ ముందు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ నిలబడలేకపోయింది. దీంతో ఆ బ్రౌజర్‌కు సహజంగానే యూజర్ల ఆదరణ తగ్గింది.
2021 ఆగస్టు 17 నుంచి ఆఫీస్ 365, వన్ డ్రైవ్, ఔట్‌లుక్ వంటివి ఎక్స్‌ప్లోరర్11ను సపోర్టు చేయవని ఈ ఏడాది నవంబర్ 30 తర్వాత నుంచి తమ టీమ్ కూడా అందుబాటులో ఉండదని పేర్కొంది. ఇక ఎడ్జ్ లెగస్సీ డెస్క్ టాప్ యాప్‌కు కూడా వచ్చే మార్చి 9 నుంచి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపింది. విండోస్ పీసీల్లో యూజర్లకు కేవలం ఎడ్జ్ బ్రౌజర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ 2015లో ఎడ్జ్ బ్రౌజర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఎడ్జ్ బ్రౌజర్‌లోనూ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లాంటి సేవలను పొందవచ్చని మైక్రోసాఫ్ట్ తెలియజేసింది.