ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు లేఆఫ్స్‌పై దృష్టిపెట్టాయి. ఆర్థిక మాంద్యం, భవిష్యత్తుపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో టెక్ సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, అమెజాన్ లాంటి బడా సంస్థలు ఇప్పటికే చాలా మంది ఎంప్లాయీస్‌ను ఇంటికి పంపించేశాయి. తాజాగా డెల్ సంస్థ కూడా 6,600 మంది ఉద్యోగులను తీసేసేందుకు చర్యలు చేపట్టింది. దీంతో ఐటీ ఉద్యోగుల్లో గుబులు రేగుతోంది. తమ జాబ్ ఉంటుందో, ఊడుతుందోనని వారిలో టెన్షన్ మొదలైంది. అదే సమయంలో ఉద్యోగులపై ఆధారపడిన వారూ ఈ పరిణామాలతో తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఇటువంటి వ్యవహారం ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెళ్లి చేసుకోబోయేవాడికి మైక్రోసాఫ్ట్‌లో జాబ్ పోయిందనీ, ఇప్పటికీ అతడ్ని పెళ్లాడొచ్చా? అని సలహా కోరుతూ ఓ మహిళ అడిగిన ప్రశ్న నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ‘కుటుంబ సభ్యులు మా ఇద్దరికీ పెళ్లి కుదిర్చారు. ఫిబ్రవరిలో పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అయితే నన్ను వివాహం చేసుకోబోయేవాడిని మైక్రోసాఫ్ట్ ఇండియా జాబ్‌లో నుంచి తీసేసింది. నా ఫ్యామిలీకి కూడా ఈ విషయం తెలుసు. నాకో సందేహం.. ఇప్పటికీ అతడ్ని మ్యారేజ్ చేసుకోవాలా? వద్దా? అనేది తెలియడం లేదు. అతడ్ని నేను పెళ్లాడొచ్చంటారా?
మైక్రోసాఫ్ట్‌లో పని చేసేటప్పుడు అతడి జీతం రూ.2.5 లక్షలుగా ఉండేది’ అని ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అతనికి నీ కంటే మంచి వ్యక్తి దొరుకుతారని కొందరు కామెంట్లు పెట్టారు. మరికొందరు పెళ్లిళ్లు ఈ రోజుల్లో కమర్షియల్‌గా మారాయని.. దీన్ని అలాగే పరిగణించాలని స్పందించారు. కాగా, జనవరిలో మైక్రోసాఫ్ట్ కంపెనీ 10 వేల మంది ఎంప్లాయీస్‌ను తొలగిస్తున్నట్లు వెల్లడించిన విషయం విదితమే. మరి.. జాబ్ కోల్పోయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా అంటూ యువతి చేసిన పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.