చాట్ జీపీటీ.. ఈమధ్య కాలంలో బాగా మార్మోగుతున్న పేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ చాట్‌బాట్ అసాధ్యం అనే పనులను కూడా సులువుగా చేసేస్తోంది. దీని వల్ల భవిష్యత్తులో చాలా జాబ్స్ పోతాయని వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!
రోజురోజుకీ ఆధునిక టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. అందుకు తగ్గట్లే సాంకేతికతలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. టెక్ వరల్డ్‌లో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గణనీయమైన మార్పులు తీసుకొస్తోంది. ఈ క్రమంలో వచ్చిన చాట్ జీపీటీ ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. లాంగ్వేజ్ ట్రాన్స్‌లేట్ చేయడంతో పాటు కృత్రిమ మేధ సాంకేతికత సాయంతో దేనికైనా జవాబు చెప్పగలదు చాట్ జీపీటీ. అలాగే రీసెర్చ్ పేపర్స్ రాయగలదు, మెయిల్స్ కూడా చేస్తుంది. ఏ ప్రశ్నకైనా ఇట్టే సమాధానం చెప్పేస్తుంది. వ్యాసాలు, కవితలు, పాటలు, పద్యాలు ఇలా ఏదైనా రాయగలదు. వీటితో పాటు కోడింగ్ కూడా చేయగలదు. అందుకే చాట్ జీపీటీ హాట్ టాపిక్‌గా మారింది.
చాట్ జీపీటీదే ఫ్యూచర్ అని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో దాదాపుగా అన్ని ప్రధాన రంగాల్లో దీని సాయంతో అనూహ్య మార్పులు వస్తాయని చెబుతున్నారు. పలు రంగాల్లో మనుషుల అవసరం కూడా ఉండదని, చాట్ జీపీటీ వాడకం పెరిగితే కంపెనీల్లో ఉద్యోగులపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి ఈ విషయంపై స్పందించారు. చాట్ జీపీటీ లాంటి ఏఐ బేస్డ్ ప్లాట్‌ఫామ్స్ మనుషుల జాబ్స్ పై ఏమాత్రం ప్రభావం చూపలేవని ఆయన అన్నారు. 1977–78ల్లో ప్రోగ్రామ్ జనరేటర్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఆందోళనలే సర్వత్రా వ్యక్తమయ్యాయని ఆయన గుర్తు చేసుకున్నారు. చాట్ జీపీటీ కోడర్‌పై కూడా ఏమాత్రం ఎఫెక్ట్ చూపలేదన్నారు.
‘చాట్ జీపీటీ కోడర్‌పై ప్రభావం చూపే అవకాశాల్లేవు. మనిషి మనసు, మేధ, మెదడు చాలా అనువుగా ఉంటాయి. ఇది ఎంత సంక్లిష్లమైన విషయాన్ని అయినా అర్థం చేసుకోగలదు’ అని నారాయణ మూర్తి పేర్కొన్నారు. నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం 2023లో మాట్లాడిన ఆయన పైకామెంట్స్ చేశారు. ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో.. అది భారత ఐటీ సంస్థలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపబోదన్నారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కామని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. మరి.. ఐటీ లాంటి పలు రంగాలపై చాట్ జీపీటీ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.