హైదరాబాద్ లో ఇల్లు కొనాలి అని అనుకునేవారికి ఈ ఏరియాలు వరంగా మారనున్నాయి. ఈ ఏరియాలు ఉన్న ప్రాంతమంతా మరో హైటెక్ సిటీ కానుందని నివేదికలు చెబుతున్నాయి.
హైదరాబాద్ లో ఇల్లు కొనడం లేదా సొంతిల్లు కట్టుకోవడం అనేది సామాన్యుడి కల. ఎక్కడ తక్కువ ధరకు స్థలం, ఇల్లు దొరుకుతుందా అని వెతుకుతుంటారు. ధర తక్కువ ఉంటే సరిపోతుందా? పెట్టిన పెట్టుబడికి భరోసా ఉండద్దు. అందుకే ఇప్పుడు స్థలం మీద గానీ, ఇల్లు మీద గానీ పెట్టుబడి పెడితే భవిష్యత్తులో అధిక రాబడి రావాలని కోరుకుంటారు. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. కానీ ఈ ఏరియాల్లో పెట్టుబడి పెట్టాలంటే సామాన్యుడి వల్ల అవ్వని పని. కానీ ఇప్పుడు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో హైటెక్ సిటీ, మాదాపూర్ అయ్యే అవకాశం ఉండే ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటి ఏరియాల్లో స్థలం కొనాలి, పెట్టుబడి పెట్టాలి అని ఎదురుచూసే వారి కోసమే ఈ కథనం.
జీవో 111 ఎత్తివేత తర్వాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఢమాల్ అని అంటున్నారు. ఫ్లాట్లు, అపార్ట్మెంట్ ధరలు తగ్గుతాయని అంటున్నారు. అయితే ఏ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉన్నా గానీ ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, పోచారం వంటి ఏరియాల్లో మాత్రం పరుగులు పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలానే కొన్ని గణాంకాలు కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారికి ఈస్ట్ హైదరాబాద్ ఒక ఉత్తమ మార్గం అని చెప్పవచ్చు. ఈస్ట్ హైదరాబాద్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. టెక్ మహీంద్రా, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలకు ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని పలు నివేదికలు చెబుతున్నాయి.
దీంతో పెట్టుబడులకు తూర్పు హైదరాబాద్ అనేది కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రాంతంలో అనేక ఫార్మా కంపెనీలు కూడా రాబోతున్నాయి. ఫేజ్ 1లో 1400 ఎకరాలు, ఫేజ్ 2లో 5 వేల ఎకరాలలో అభివృద్ధి కార్యాచరణకు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. భవిష్యత్తులో రానున్న పెట్టుబడులతో 3.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో స్థలాలు, ఫ్లాట్లు కొనాలనుకునేవారి సంఖ్య 91 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉప్పల్ నాగోల్, ఎల్బీనగర్, పోచారం వంటి ఏరియాల్లో 50కి పైగా కొత్త ప్రాజెక్టులు మొదలయ్యాయి. రెసిడెన్షియల్ స్థలాలే కాదు కమర్షియల్ ల్యాండ్ల కొనుగోళ్లు కూడా 80 శాతం పెరిగాయి.
క్లినిక్ లు, షోరూంలు, రెస్టారెంట్ వంటి భవనాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో తూర్పు హైదరాబాద్ కి మహర్దశ పడుతుందని.. మరో హైటెక్ సిటీగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ ఏరియాలకు మెట్రో కనెక్టివిటీ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఆదిభట్లలో టీసీఎస్ కంపెనీ ఉంది. ఇన్ఫోసిస్ కంపెనీ కూడా దగ్గర్లోనే ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలకు, టెక్ కంపెనీలకు ఉప్పల్, నాగోల్. ఎల్బీనగర్ ఏరియాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ ఏరియాల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని చెబుతున్నారు. ఇప్పుడు స్థలం గానీ ఫ్లాట్ గానీ విల్లా గానీ కొనడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.
ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ ఏరియాల్లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనాలనుకుంటే చదరపు అడుగుకి రూ. 5 వేల నుంచి రూ. 6 వేల మధ్యలో దొరుకుతున్నాయి. సెమీ గేటెడ్ కమ్యూనిటీస్ లో ఫ్లాట్ లేదా విల్లా కొనాలనుకుంటే రూ. 5500, రూ. 6000, రూ. 6500 రేంజ్ లో ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీస్ లో కొనాలనుకుంటే రూ. 6 వేల నుంచి రూ. 7 వేల మధ్యలో ఉంటాయి. ఉప్పల్ చుట్టుపక్కల సెమీ గేటెడ్ లో చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. నాగోల్ లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ రూ. 5 వేల నుంచి రూ. 5,500 మధ్యలో దొరుకుతున్నాయి. సెమీగేటెడ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రూ. 5,500 నుంచి రూ. 6,000 మధ్యలో ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్ రూ. 6,000, రూ. 6500, రూ. 7,000 మధ్యలో ఉన్నాయి. ఎల్బీ నగర్ లో కూడా ఇలానే ఉన్నాయి.
ల్యాండ్ రేట్లు చూసుకుంటే ఉప్పల్ లో చదరపు అడుగుకు రూ. 1250 నుంచి 7,250 మధ్యలో ఉన్నాయి. నాగోల్ లో చదరపు అడుగుకి రూ. 3800 నుంచి 7,550 మధ్యలో ఉన్నాయి. ఎల్బీనగర్ లో కూడా ఇంచుమించు ఇలానే ఉన్నాయి. ప్రస్తుతం హైటెక్ సిటీలో ల్యాండ్ రేటు చదరపు అడుగుకు సగటున రూ. 1150 నుంచి రూ. 12,350 రేంజ్ లో ఉన్నాయి. ఫ్లాట్ రేటు ఐతే చదరపు అడుగుకు రూ. 9800 నుంచి 13,850 రేంజ్ లో ఉన్నాయి. సగటున రూ. 10,550 పలుకుతోంది. ఫ్లాట్ ధరల్లో పదేళ్లలో 170 శాతం, ఐదేళ్ళలో 67.4 శాతం, మూడేళ్ళలో 16.8 శాతం, గత ఏడాదిలో 11.3 శాతం వృద్ధి రేటు అనేది కనిపించింది. ఇలాంటి వృద్ధి అనేది నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్, పోచారం వంటి ప్రాంతాల్లో రానున్న రోజుల్లో చూడవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇదే గనుక నిజమైతే ఇప్పుడు 40, 50 లక్షలు పెట్టుబడి పెట్టి ఫ్లాట్ కొన్నవారికి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.