అంతర్జాతీయంగా రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం మరింత వేడెక్కింది. ఇరుదేశాల సరిహద్దుల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ సూచీలపై పడుతోంది. దేశీయ సూచీలు సైతం మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉక్రెయిన్ విషయంలో ఇటు రష్యా, అటూ అమెరికా వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం తప్పదనే పరిస్థితి నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ఈ వివాదం కారణంగానే దేశీయ మార్కెట్లు సైతం అతలాకుతలం అవుతున్నాయి.
ఇరుదేశాల మధ్య ప్రస్తుత పరిణామాలు మదుపర్లను తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఉక్రెయిన్ లోని వేర్పాటువాద ప్రాంతాలను రష్యా స్వతంత్ర ప్రదేశాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. దీనిని ఉక్రెయిన్, అమెరికా సహా నాటో కూటమిలోని దేశాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.ఉక్రెయిన్ విషయంలో ఇటు రష్యా, అటూ అమెరికా వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం తప్పదనే పరిస్థితి నెలకొంది. మరోవైపు రష్యా గుర్తించిన ప్రాంతాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితులు ఉన్నట్లు కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టాలు చవిచూస్తున్నాయి. మరోవైపు ముడి చమురు ధరలు 100 డాలర్లకు చేరువై ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభం కావడంతోనే నష్టాలు మొదలయ్యాయి. మొదటి పది నిమిషాల లోపే బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 1261 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ సైతం 358 పాయింట్లు నష్టపోయింది. ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. దీంతో నిఫ్టీ 17 వేల దిగువకు చేరుకోగా సెన్సెక్స్ 57 వేల కిందకు పడిపోయింది. ఉదయం 10:23 గంటల సమయంలో సెన్సెక్స్ 867 పాయింట్ల నష్టంతో 56,815 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 265 పాయింట్లు నష్టపోయి 16,941 వద్ద ట్రేడవుతున్నాయి. అయితే ఉక్రెయిన్ వివాదంపై ఈ రోజు ఐక్యరాజ్య సమితి భద్రత మండలి అత్యవసర సమావేశం నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో మార్కెట్ నష్టాలకు కొంతైనా బ్రేక్ పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.