ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించడం అన్నది ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయమే. రాను రాను నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. మరోవైపు ఉద్యోగులకు తాము చదివిన చదువులకు తగ్గ ఉద్యోగాలు లభించడం లేదు. ఒకవేళ ఉద్యోగం దొరికినా చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నారు. ఇక గత రెండేళ్లుగా కరోనా వల్ల మరింత మంది నిరుద్యోగులుగా మారారు. అయితే భూమ్మీద ఉన్న ప్రతి మనిషికి గాలీ, నీరు, తిండి లాగానే డబ్బు కూడా నిత్యవసరంగా మారింది. అందుకే పేదవారి నుంచి ధనవంతుల వరకు అందరి ఆలోచన డబ్బు సంపాదన గురించే.
డబ్బు సంపాదించాలనుకునే ఎవరైనా సరే.. కచ్చితంగా ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని చూస్తుంటారు. ఇలా పొదుపు చేసిన డబ్బు భవిష్యత్తులో వచ్చే అత్యవసర ఖర్చులతోపాటు పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు వంటి వాటికి ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఎంతో కొంత డబ్బును పొదుపు చేసేందుకు ప్రయత్నిస్తారు. అయతే ప్రస్తుతం మనకు డబ్బును పొదుపు చేసేందుకు రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అన్నింటిలోకెల్లా ఉత్తమమైన రిటర్న్స్‌ను ఇచ్చేది మాత్రం మ్యూచువల్ ఫండ్స్ సిప్ అని చెప్పవచ్చు.
సిప్ (SIP) అంటే.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. మ్యూచువల్ ఫండ్స్ అనగానే సాధారణంగా చాలా మంది భయపడిపోతుంటారు. కానీ సిప్‌లో పొదుపు చేయడానికి ఎలాంటి భయం అవసరం లేదంటున్నారు నిపుణులు. కాకుంటే ఇందులో దీర్ఘకాలం పొదుపు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో డబ్బుకు రక్షణ ఉండడంతోపాటు ఎక్కువ కాలం పొదుపు చేస్తే రిటర్న్స్ కూడా ఎక్కువ పొందవచ్చంటున్నారు.
ఉదాహరణకు.. రోజుకు రూ.100 చొప్పున పొదుపు చేస్తే. నెలకు రూ.3000.. సవత్సరానికి 36,000. ఇలా ఒక వ్యక్తి 30 ఏళ్ల పాటు మ్యూచువల్ ఫండ్స్ SIP లో డబ్బును పొదుపు చేస్తే 30 ఏళ్లకు అతను పెట్టిన మొత్తం రూ.10,80,000 అవుతుంది. దీనికి ఎంత లేదన్నా కనీసం 15 శాతం వరకు రిటర్న్స్ వచ్చినట్లయితే రూ.1,99,49,461 వస్తాయి. ఈ మొత్తాన్ని మన పొదుపుకు కలిపితే అది రూ.2,10,29,461 అవుతుంది.
మన అదృష్టం బాగుంటే ఇదే పథకంలో చివరి 3-4 ఏళ్ల సమయంలో మార్కెట్‌లో రిటర్న్స్ శాతం పెరిగితే మన చేతికి వచ్చే డబ్బులు కూడా పెరుగుతాయి. అపుడు మన పెట్టుబడి రూ.1,56,37,884 అయితే.. రూ.9,16,19,430 రిటర్న్స్ వస్తాయి. పొదుపు,రిటర్న్స్ రెండూ కలిపితే రూ.10,72,57,314 అవుతాయి. ఈ లెక్కలను ఆన్‌లైన్‌లో లభిస్తున్న ఒక SIP టూల్ ద్వారా లెక్కించి చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా ప్రతి ఒక్కరికీ రిటర్న్స్ రాకపోవచ్చు. కానీ పైన తెలిపిన విధంగా 15 శాతం రిటర్న్స్ వేసుకున్నా.. రూ.2,10,29,461 పొందవచ్చు. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ SIP పథకం ద్వారా మనం పొదుపు చేసుకునే డబ్బులకు ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ పొందవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు.