బిగ్‌బాస్ సీజన్ 6 ముగింపుకు వచ్చింది. డిసెంబర్ 18 ఆదివారం నాడు బిగ్‌బాస్ ఫినాలే. మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా.. శ్రీసత్య హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్లు మాత్రమే బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నారు. ఇప్పటికే వీరిలో విన్నర్, రన్నర్, మూడో స్థానంలో ఉండే వారు ఎవరో.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. చాలామంది సింగర్ రేవంత్ విన్నర్ అని ఫిక్స్ అయ్యారు. ఇక శ్రీహాన్ రన్నర్‌గా నిలవగా.. ఆదిరెడ్డి లేక కీర్తి మూడో స్థానంలో ఉంటారని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఇక బిగ్ బాస్ ఫినాలే అనగానే తారలు దిగివచ్చినట్టే అనిపిస్తుంది. ఫినాలే ఎపిసోడ్‌కి చాలా మంది సెలబ్రిటీలు గెస్ట్లుగా వస్తుంటారు.
గతంలో చిరంజీవి స్పెషల్ గెస్టుగా హాజరైన సీజన్లు ఉన్నాయి. మరి ఈసారి ఎవరు వస్తారనే దానిపై చాలా సస్పెన్సు ఉంది. కాగా తాజాగా అందిన సమాచారం మేరకు బిగ్‌బాస్ ఫినాలేకు రవితేజ గెస్ట్‌గా వచ్చాడని తెలుస్తోంది. అయితే రవితేజ ట్రోఫీ అందించే స్పెషల్ గెస్టా లేక ఇంట్లోకి వెళ్లే తారల్లో ఒకరా అనేది తెలియదు.
కానీ రవితేజ మాత్రం బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. కొన్ని రోజుల్లో రవితేజ ధమాకా సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా.. రవితేజ బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక రవితేజతో పాటు.. శ్రీలీల కూడా వచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే.. ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాలి.
ఇక ఈ సీజన్ విన్నర్ రేవంత్ అని షో ప్రారంభమైన కొన్ని రోజుల నుంచే వినిపిస్తుంది. దీనికి తోడు.. ఇంకా ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ కాకముందే.. రేవంత్ తల్లి.. నా కొడుకుని గెలిపించినందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఓ యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ తల్లి మాట్లాడుతూ.. ఇలాంటి కొడుకే తనకు పుట్టాలని ఎప్పటికీ దేవుడిని కోరుకుంటానని కూడా చెప్పింది. అంతేకాదు రేవంత్ ఇంటి దగ్గర అతడికి ఆహ్వానం పలికేందుకు భారీగా ఏర్పాట్లు కూడా చేశారట.
ఇక ఫినాలే వేదికపై నాగార్జున ఇద్దరి కంటెస్టెంట్ల చేతులు పట్టుకుని నిల్చుని చివరకు విజేత చేతిని పైకెత్తుతాడు. అలా వేదికపై నిల్చుంది రేవంత్, శ్రీహాన్ అని తెలుస్తోంది. వీరిద్దరిలో రేవంత్ విన్నర్ అయినట్టు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక శ్రీహాన్ రన్నర్‌గా మిగిలిపోయినట్టు తెలుస్తోంది. టాప్ 5లో ఉన్న వారిలో.. ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అయి ముందే బయటికి వచ్చేసినట్లు సమాచారం. మరి ఇవన్ని నిజమో కాదో తెలియాలంటే.. ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాలి.
ఇక మరో వార్త ఏంటంటే.. వచ్చే సీజన్ నుంచి నాగార్జున బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించడని వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్ల సమయంలో కూడా ఇలాంటి ప్రచారమే సాగింది. మరి వచ్చే సీజన్‌కు నాగార్జున బిగ్‌బాస్ హోస్ట్‌గా చేస్తారా.. లేదా.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.