‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. సెలబ్రిటీలుగా వెళ్లినవాళ్లు కొత్త అవకాశాలతో కెరీర్‌లో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. అయితే ఈ షో ద్వారా కొందరు దెబ్బితిన్న వాళ్లు కూడా లేకపోలేదు. షణ్ముఖ్ లాంటి వాళ్లకు లవ్ బ్రేకప్ అయి జీవితం కొత్త మలుపు తిరగడం కూడా చూశాం. అయితే ఈ షోకి తెలుగులో ఎంతో గొప్ప ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఈ షోని వ్యతిరేకించే వాళ్లు కూడా లేకపోలేదు. ఎంత పొగుడుతారో అంత తిట్టే వాళ్లు కూడా ఉన్నారు. వారిలో ప్రధానం సీపీఐ నారాయణ ముందుంటారు.
నిజానికి బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో ప్రారంభం అయిన దగ్గరి నుంచి నారాయణ దానిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. గత సీజన్‌పై కూడా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సమయంలో అయితే అదొక బ్రోకర్ హౌస్ అంటూ నిప్పులు చెరిగారు. ఎప్పుడూ ఒక వీడియో విడుదల చేసి బిగ్ బాస్‌ని వ్యతిరేకించే నారాయణ.. ఈసారి పంధా మార్చారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6పై స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈసారి కూడా బిగ్ బాస్‌కి కొత్త పేరు పెట్టారు. అది బూతుల స్వర్గం అంటూ నామకరణం చేశారు. సిగ్గు ఎగ్గూ లేనోళ్లు, అచ్చోసిన ఆంబోతులు అంటూ ఈసారి కూడా తీవ్ర, పరుష పదజాలాన్నే ఉపయోగించారు.
“సిగ్గు, యెగ్గులేని జంతువులు ఏమైనా చేయచ్చు. కొన్ని వింత జంతువులు, భార్యాభర్తలు కానివాళ్లు, అన్నాచెల్లెళ్ల బంధం లేనోళ్లు, అసలు ముక్కు మొఖం కూడా తెలియని పిటపిటలాడే అందగాళ్లు అంతా.. అక్కినేని నాగార్జున కనుసన్నల్లో వంద రోజులు గడిపేందుకు అచ్చోసిన ఆంబోతుల్లా వస్తున్నారు. ఆ బూతుల స్వర్గంలో సమయాన్ని వృథా చేసే బిగ్ బాస్ అనే మహత్తర కార్యక్రమం వస్తోంది. దీనిపై ప్రేక్షకులే ప్రశ్నించాలి. అసలు బిగ్ బాస్ ద్వారా మాకు ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ ప్రశ్నించాలి. మెగుళ్లు పెళ్లాల్ని వదిలేసి, పెళ్లాలు మొగుళ్లను వదిలేసి అచ్చోసిన ఆంబోతుల్లాగా జీవించమని సందేశమిస్తారా? కాసుల కోసం కక్కుర్తి పడే లజ్జారహితులు ఉన్నంత కాలం, ఈ పాపాలకు ఆదరణ ఉన్నంత కాలం, ద్రౌపది వస్త్రాపరహరణం వర్దిల్లుతూనే ఉంటుందని దిగమింగుదామా? లేక పదండి ముందుకు అని ఉరుకుదామా?” అంటూ నారాయణ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీపీఐ నారాయణ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.