ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి.. విధి నిర్వహణలో ఎంత బాధ్యతగా ఉండాలో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మహిళతో చాల మర్యాదగా ప్రవర్తించాలి. కానీ సదరు ఉద్యోగి ఆ మాటలను మర్చిపోయాడు. తోటి ప్రభుత్వ ఉద్యోగి, అందునా మహిళ అని కూడా చూడకుండా.. ఆమెపై చిందులు తొక్కారు. నోటికి వచ్చినట్లు తిట్టడు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
గోవిందపురం గ్రామస్తులు ప్రతిరోజూ లంకలపల్లి మీదుగా పక్కనే ఉన్న కందివలసగెడ్డలోని ఇసుకను ఎడ్లబండ్లలో తరలిస్తున్నారు. ఇసుకను పెద్ద మొత్తంలో తీసుకెళ్తున్నారని, ఫలితంగా బోరుబావులు ఎండిపోతున్నాయని లంకలపల్లి గ్రామస్థులు వాదిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఎడ్ల బండ్లను అడ్డుకోవడంతో రెండు గ్రామాల ప్రజల మధ్య వివాదం చెలరేగింది. దీంతో స్థానిక ఎస్సై జయంతి, సిబ్బంది అక్కడికి చేరుకుని ఈ ఘటనపై ఆరా తీశారు. రెండు గ్రామాల వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే, గ్రామస్తులు ఎంతకీ ఎస్‌ఐ మాట వినకపోయేసరికి అప్పటికే అక్కడున్న తహసీల్దారు కృష్ణమూర్తి జోక్యం చేసుకున్నారు. గ్రామస్తులను పంపించివేయడంలో ఎస్సై విఫలమయ్యారంటూ అసభ్యంగా మాట్లాడారు. పని చేతకాకపోతే యూనిఫాం తీసేసి గేదెలు మేపుకోవాలని.. అసలు నీకు ఉద్యోగం ఎందుకు అంటూ ప్రశ్నించారు. కాగా, మహిళా ఎస్సైని దూషించిన తహసీల్దార్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై భోగాపురం ఎస్‌ఐ మహేష్‌తో పాటు సిబ్బంది… ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మహిళా ఎస్సైపై ఎమ్మార్వో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని సీఐ విజయ్‌కుమార్ చెప్పారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.