తిరుమల లడ్డూ ప్రసాదానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ లడ్డూకు వచ్చే రుచి మరెక్కడా రాదని భక్తులు అంటుంటారు. అంతటి ఘనమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అది ఏంటంటే..!
కళియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు ఎంతగా పరితపించిపోతారో తెలిసిందే. ఒక్కసారి స్వామివారిని కనులారా దర్శనం చేసుకుంటే చాలని భావిస్తారు. ఇక, దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదం తీసుకోవడాన్ని పవిత్రంగా భావిస్తారు భక్తులు. తిరుమల లడ్డూకు వచ్చే రుచి మరెక్కడా లభించిందని అంటుంటారు. శతాబ్దాలుగా రుచి, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా వీటిని తయారు చేస్తున్నారు. 307 ఏళ్ల చరిత్ర ఉన్న తిరుమల ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులు పరమభక్తితో స్వీకరిస్తారు. ఇప్పుడు ఇదే లడ్డూ ప్రసాదం కౌంటర్లలో ప్రకృతి పరిరక్షణ.. సంప్రదాయ వృత్తులకు చేయూత అందించే విధంగా చర్యలు మొదలుపెట్టారు. తిరుమలలో లడ్డూ ప్రసాదాల పంపిణీకి సంబంధించి టీటీడీ ఇటీవల పలు నిర్ణయాలు తీసుకుంది.
లడ్డూ కేంద్రాల పెంపుతో పాటు ప్రసాదం తయారీకి అత్యాధునిక యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది టీటీడీ. ఈ క్రమంలో ఇప్పుడు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో ప్లాస్టిక్ ఉపయోగాన్ని పూర్తిగా రద్దు చేసింది. వాటి స్థానంలో బయో డీగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అలాగే ప్రకృతి వ్యవసాయవేత్త విజయ్‌రామ్ సహకారంతో టీటీడీ తాటాకు బుట్టలను లడ్డూ విక్రయ కేంద్రంలో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. తద్వారా తాటి చెట్లను పెంచేవారికి ఆదాయంతో పాటు తాటాకు బుట్టలను అల్లే సంప్రదాయ వృత్తి కళాకారులకు ఆర్థిక చేయూతను అందించేందుకు రెడీ అవుతోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి.. తిరుమల బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.