రాష్ట్రంలో పేద ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. పిల్లలు చదువుకునే దగ్గర నుంచి వివాహం చేసుకునే వరకూ అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది.
ఇప్పటికే అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఇలా పలు సంక్షేమ పథకాలతో పేదలకు ఆర్థిక సాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. చదువుకునేంత వరకే కాకుండా చదువు తర్వాత జరిగే వివాహ విషయంలో కూడా ఏపీ సర్కార్ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు. పెళ్లి చేయడమంటే మామూలు విషయం కాదు. ఇక పేదవారికైతే ఉన్న కొంచెం పొలం, ఇల్లు ఏదుంటే అది అమ్ముకునే పరిస్థితి. పెళ్లి చేయడానికి ఏ పేద తండ్రి బాధకూడదన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల పేరుతో ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ వస్తుంది.
ఇప్పుడు అందిస్తున్న నిధులతో కలిపి గడిచిన 9 నెలల్లో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద 35,551 మంది అర్హుల ఖాతాల్లో దాదాపు 267.20 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులను ఇవాళ విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,833 జంటలకు 141.60 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ నగదును వధువు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు ద్వారా.. అలానే మైనారిటీ వర్గాల ఆడపిల్లలకు షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందిన్నారు.
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద ఎస్సీలకు రూ. లక్ష సాయం అందిస్తుంది. ఎస్సీ కులాంతర వివాహం చేసుకునే ఎస్సీలకు రూ. 1,20,000 అందిస్తుంది. ఎస్టీలకు రూ. లక్ష, కులాంతర వివాహం చేసుకునే ఎస్టీలకు రూ. 1,20,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తుంది. బీసీలకు రూ. 50 వేలు, కులాంతర వివాహం చేసుకునే బీసీలకు రూ. 75 వేలు అందిస్తుంది. మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సహాయం చేస్తుంది. దూదేకుల, నూర్ బాషాల విజ్ఞప్తి మేరకు వైఎస్సార్ షాదీ తోఫాను రూ. లక్షకు పెంచారు. విభిన్న ప్రతిభావంతులకు రూ. 1,50,000, భవన నిర్మాణ కార్మికులకు రూ. 40 వేలు అందిస్తుంది.
ఈ పథకం పొందాలంటే వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని.. పెళ్లి నాటికి అమ్మాయి వయసు 18, అబ్బాయి వయసు 21 ఏళ్ళు దాటి ఉండాలన్న నియమాన్ని ఏపీ ప్రభుత్వం పెట్టింది. దీని వల్ల బాల్య వివాహాల నివారణ జరగడమే కాకుండా వారి చదువుకు ఎటువంటి ఆటంకం ఉండదని.. అందుకు తగ్గట్టుగా ఇంటర్ వరకూ అమ్మ ఒడి సాయం.. ఆ పై చదువులకు జగనన్న విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన ద్వారా భోజన, వసతి ఖర్చులకు డబ్బులు ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు. దీని వల్ల సమాజంలో విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు తయారవుతారని అన్నారు.