ఈ మద్య కొంత మంది దొంగలు బరితెగించిపోతున్నారు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. అమాయకులకు ఆకస్మిక ధన లాభం కలిసివస్తుందని పూజల పేరిట మోసం చేస్తూ అందినంత దోచుకుంటున్నారు. కొంతమంది దొంగలు మరీ దారుణంగా స్మశానాలను కూడా వదలడం లేదు. ఆ మద్య హైదరాబాద్ లోని చాంద్రాయణ గుట్ట సమీపంలో ఉన్న స్మశానవాటికలో దొంగలు పడి దహన సంస్కారాలకు వాడే సామాను, డిజిల్, బ్యాండ్ ఎత్తుకు వెళ్లారు.
అచ్చం ఇలాంటి ఘటన జగ్గంపేట శ్మశాన వాటికలో జరిగింది. ఒక్క నెలలోనే రెండుసార్లు ఈ దొంగతనాలు జరిగినట్లు శ్మశాన నిర్వాహకులు తెలిపారు. మొదట సబ్ మెర్సిబుల్ మోటార్ ని ఎత్తుకువెళ్లిన దొంగలు ఈసారి ఏకంగా దహనం చేసే బీడు పొయ్యిని ఎత్తుకు వెళ్లారని అన్నారు. ఇటీవల శ్మశాన వాటికను ప్రభుత్వం, దాతలు ఇచ్చిన ఆర్థిక సహాయంతో అభివృద్ది చేస్తుంటే దొంగలు పడి అన్నీ దోచుకు వెళ్తున్నారని గ్రామస్తులు వాపోయారు. ఇక్కడ నిఘా లోపం ఉండటమే ముఖ్య కారణమని అంటున్నారు. మరోసారి ఇలాంటి చోరీలు కాకుండా ఇక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను శ్మశాన నిర్వాహకులు కోరుతున్నారు.
ఇటీవల కొన్ని శ్మశానాల్లో నిఘా లోపం ఉండటం వల్ల దొంగలు బరితెగించి అక్కడ చోరీలకు పాల్పపడుతున్నారు. చిన్న చిన్న వస్తువులను దొంగిలిస్తున్నారు. అయితే శ్మశాన నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఇటాంటి ఘటనలు మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఎవరైనా శ్మశానానికి రావాల్సిందే.. అలాంటి అక్కడ కూడా దొంగలు చేతివాటం చూపించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.