ఓ గేదె రోజుకు ఎన్ని లీటర్ల పాలను ఇస్తుంది. మహా అయితే ఆరు నుండి పది లీటర్ల పాలనిస్తుంది. కానీ ఈ గేదె రోజుకు ఏకంగా 26.58 లీటర్ల పాలను ఇస్తూ ఔరా అని అబ్బురపరుస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన ఇంకే విషయమేమిటంటే ఈ గేదె పుట్టిన బిడ్డ.. తల్లి రికార్డును బద్దలు కొట్టి.. అధిక పాల దిగుబడినివ్వడం విశేషం. పిల్ల గేదె ఏకంగా 26.59 లీటర్ల పాలనిస్తుంది. తల్లి గేదె ఆరో ఈతలో అత్యధిక దిగుబడి ఇస్తే.. నాలుగేళ్ల వయసు కలిగిన పిల్ల గేదె రెండో ఈతలోనే ఇస్తుంది. ఇంతకూ ఈ గేదెలక్కడవనుకున్నారూ.. మన మండపేటవి.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన పాడి రైతు ముత్యాల సత్యనారాయణ.. పశుపోషణ చేస్తుంటారు. ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ముర్రా జాతి పాడి గేదెను కొనుగోలు చేశారు. ఇంటికి తెచ్చి పోషణ నివ్వగా.. ఆరో ఈతలో 26. 58 లీటర్లనిచ్చింది. ఈ ఆరు ఈతల్లో నాలుగు దున్నపోతులు, రెండు పెయ్య దూడలు పుట్టాయని ఆయన చెప్పారు. రెండు దున్నలను సెమన్ సేకరణ కేంద్రాల వారు తీసుకెళ్లగా, మరో రెండు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. రికార్డు స్థాయిలో పాల దిగుబడిని ఇస్తున్న పిల్ల గేదె ఆరో విడతలో పుట్టిందనన్నారు.
వీటికి దాణాగా పశుగ్రాసాలు, మొక్కజొన్న, ఉలవలు, తవుడు అందిస్తున్నామని చెప్పారు. కాగా, తల్లి గేదె గతంలో విజయవాడ, మండపేటల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పాల దిగుబడి పోటీల్లో రెండు సార్లు మొదటి స్థానంలో నిలిచింది. పిల్ల గేదె రికార్డు స్థాయిలో పాల దిగుబడిని ఇస్తుందని కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిథి డి.రాజేశ్వరరావు నిర్ధారించారు. మండపేట, పరిసర ప్రాంతాల్లో అత్యధిక పాల దిగుబడినిచ్చే పాడి పశువులను గుర్తిస్తుండగా..అందులో భాగంగా ఈ పిల్ల గేదె పాల దిగుబడిని లెక్కించారు. ఇది సుమారు 27 లీటర్ల పాలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు.