ఆకాశంలో సగం, అన్నింటా ముందంజ అయినా ఏదో ఓ చోట అవహేళనలు, వేధింపులు. ఇంటా, బయట అని తేడా లేకుండా ప్రతి మహిళా ఏదో ఓ పరిస్థితుల్లో వీటిని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏ రంగంలోనైనా తమ సత్తాను నిరూపించుకుంటున్న మహిళలు, ఇంట్లో బాధితులవుతున్నారు. రచ్చ గెలిచిన వారూ ఇంట గెలవలేకపోతున్నారు. ప్రముఖ చేతుల మీదుగా పతకాలు, పేరు సంపాదించినా.. భర్త చేతుల్లో వేధింపులు తప్పడం లేదు. దానికి సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం అతీతమేమీ కాదనేందుకు ఈ ఘటనే చిన్న ఉదాహరణ.
సయ్యద్ షహనాజ్ భాను .. పంజాబ్ రాష్ట్రం. టెన్నిస్ లో జాతీయ స్థాయి పతకాలు సాధించారు. రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతి, ప్రధాన మంత్రి చేతుల మీదుగా పలు అవార్డులు అందుకున్నారు. యూత్ అంబాసిడర్ గా దేశానికి ప్రాతినిధ్యం వహించారు. పలు భాషల్లో మాట్లాడే ప్రావీణ్యం ఆమె సొంతం. ఇవన్నీ ఆమె విజయాలు. కానీ ఆ విజయాలే ఆమె భర్తకు కంటగింపుగా కనిపించాయి. దీంతో ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. చివరకు విజయవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ విషయాన్నిఆమె స్వయంగా వెల్లడించారు.
తనపై భర్త చేసిన అరాచకాలను విజయవాడలో మీడియా వేదికగా ఆమె వెల్లడించారు. గర్భిణిగా ఉన్న సమయంలో తనను కాలితో తన్నడంతో గర్భస్రావమైందన్నారు. కారు, ఐఫోన్ కావాలని వేధిస్తుంటాడని, లగ్జరీకి అలవాటు పడి డబ్బులు కావాలని హింసిస్తుంటాడని పేర్కొన్నారు. కేసు కాకుండా పోలీసులపై తన భర్త ఒత్తిడి తీసుకురావడంతో కేవలం గృహ హింస కేసు పెట్టి చేతులు దులుపుకున్నారన్నారు. అప్పటి నుండి సెక్షన్లు మార్చమని పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. గతంలో చెన్నైలో ఉన్న సమయంలో కూడా తనపై దాడి చేస్తే అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానని, అయితే వేధించనని నమ్మించి, తర్వాత గొడవకు దిగేవాడని చెప్పారు.