కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా రంగానికి చెందిన వ్యక్తులపై చేసిన వ్యాఖ్యలపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. సినిమా వాళ్లు కష్టపడి డబ్బులు సంపాదిస్తారే కానీ ఎవరినీ దోచుకుని ఆస్తులు కూడబెట్టుకోవడం లేదని అన్నారు. అదే ఆలోచనలతో ఏ రాజకీయ నాయకులైనా ఉంటే ముందుకు రావాలని.. రాజకీయ నాయకుల ఆస్తులు, సినిమా వాళ్ళ ఆస్తుల లెక్కలు తీద్దామా? అంటూ సవాల్ విసిరారు.
తెలంగాణ ప్రభుత్వానికి రేట్లు పెంచే అవకాశముంటే ఏపీ ప్రభుత్వానికి రేట్లు తగ్గించే అవకాశం కూడా ఉందన్నారు. అదే సమయంలో ప్రొడక్ట్ కు తగిన ధర నిర్ణయించుకునే అధికారం నిర్మాతలకు ఉంటుందన్నారు. సినిమా రంగానికి కులాన్ని, మతాన్ని ఆపాదించడం ఎంతమాత్రం సరికాదని భరద్వాజ అన్నారు. సినిమా రంగంలో ఉన్న అందరికి సిగ్గు, దమ్ము, ధైర్యం ఉన్నాయని, ఎవరికో భయపడి ఉండాల్సిన అవసరం తమకు లేదని భరద్వాజ తెలిపారు. తెలుగు సినిమా వాళ్ళకు బలిసింది అంటూ ఓ శాసన సభ్యుడు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమైనవని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.