రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైలు పూర్తిగా ఆగినప్పుడు మాత్రమే ఎక్కడం గానీ, దిగడం గానీ చేయాలి. లేదంటే లైఫ్ రిస్క్ లో పడుతుంది. అయితే ఒక యువతి రైలు దిగుతుండగా.. ప్లాట్ ఫార్మ్ కి, ట్రైన్ కి మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. రైలు దిగుతుండగా ఒక విద్యార్థిని కాలు జారి ప్లాట్ ఫార్మ్ కింద పడింది. దీంతో ఆ విద్యార్థిని రైలుకి, ప్లాట్ ఫార్మ్ మధ్య ఇరుక్కుపోయింది. గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ రైలులో యువతి అన్నవరం నుంచి దువ్వాడ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అన్నవరంలో ఎక్కినా యువతి.. దువ్వాడ రైల్వే స్టేషన్ చేరుకోగానే దిగుతుండగా.. కాలు జారి ప్లాట్ ఫార్మ్ మధ్యలో ఇరుక్కుంది.
దాదాపు గంటన్నర సేపు ఆ యువతి బయటకు రాలేక అవస్థలు పడింది. అక్కడకు చేరుకున్న రైల్వే సిబ్బంది ఆమెను బయటకు తీసేందుకు గంటన్నర పాటు శ్రమించాల్సి వచ్చింది. చివరకి ప్లాట్ ఫార్మ్ పగులగొట్టి యువతిని సురక్షితంగా బయటకు తీశారు. స్వల్ప గాయాలు కావడంతో యువతిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. యువతి దువ్వాడ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు గంటన్నరకు పైగా గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ రైలు స్టేషన్ లోనే ఆగిపోయింది. మరి రైలు పూర్తిగా ఆగకుండా ఉన్న సమయంలో దిగిందా? లేక ఆగిన తర్వాతే దిగితే ఈ ఘటన చోటు చేసుకుందా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా గానీ రైలు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.