నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని సామెత. అబద్ధానికి ఉన్న పవర్ అలాంటిది. సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఏ వార్త అయినా సరే క్షణాల్లో ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. దానిలో నిజానిజాల సంగతి పక్కన పెడితే.. క్షణాల మీద అవి వైరలవ్వడం.. ఎవరో ఒకరు అప్రతిష్ట పాలు కావడం నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన ఏపీ రాజకీయాల్లో చిచ్చు పెట్టింది. సీఎం జగన్ ఓ వైసీపీ ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. కానీ అది అబద్ధం. విషయం కాస్త సదరు ఎమ్మెల్యేకు తెలియడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళ్తే… సీఎం జగన్, కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై చేయి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ హల్ చల్ చేస్తోంది. దీనిపై ఇటు టీడీపీ, అటు వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ వివాదం పెరిగి.. చివరకు బూతులు తిట్టుకునే వరకు వెళ్లింది. వివాదం గురించి ఎమ్మెల్యేకు తెలిసింది. వెంటనే స్పందించిన ఆయన.. మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. వివాదాస్పద పోస్ట్ చేసిన వారి మూలాలు గుర్తించారు. ఈ పోస్ట్ వెనక ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగు యువత కీలకనాయకుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు వ్యక్తి పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉండటంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
ఈ సదర్భంగా కృష్ట ప్రసాద్ మాట్లాడుతూ.. తనకు ముఖ్యమంత్రి జగన్ తో ఎలాంటి విబేధాలు లేవని… అలాంటిది ఆయన తనను ఎందుకు కొడతారని కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. తనపై కుట్రపూరితంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని… ఇలాంటి ప్రచారాలను ప్రజలు, వైసిపి శ్రేణులు నమ్మవద్దని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.