ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పరిపాలనను సాగిస్తున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశారు. గత పాలకులు అందించలేని అనేక ఫలాలను రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ అందిస్తున్నారు. అందుకే ఆయన పరిపాలనపై ప్రజలతో పాటు ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణ మూర్తి సీఎం జగన్ ను ప్రశంసించారు. గురువారం నర్సీపట్నంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న నారాయణమూర్తి.. ‘ఉత్తరాంధ్రకు గత పాలకులు చేయని పనులు చేస్తోన్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి సెల్యూట్’ అంటూ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు.
గురువారం అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.500 కోట్లతో ఈ మెడికల్ కాలేజీని నిర్మించనున్నారు. అలానే రూ.470 కోట్లతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాక రూ.16 కోట్లతో నర్సీపట్నంలోని రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగునాథుని పాలెం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగా సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తాండవ- ఏల్తేరు ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేయడంతో అక్కడి వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ నారాయణ మూర్తి.. సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు.
ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. “స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా.. తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలో తాగడానికి గుక్కెడు నీరు దొరికేది కాదు. సాగు భూమిలేదు. వ్యవసాయం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. జీవనోపాధి కోసం ఇక్కడి రైతులు వలస పోతున్నారు. ఇలాంటి సమయంలో నేను, కొందరు ఎమ్మెల్యేలు కలిసి తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం గురించి సీఎంకి తెలియజేశాము. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడిచిన ఎవరు చేయని పనిని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు చేశారు. మన ప్రాంతంలోని కీలకమైన తాండువ-ఏలేరు రిజర్వాయర్ పనులకి శంకుస్థాపన చేసిన జగన్ మోహన్ రెడ్డికి నా సెల్యూట్” అంటూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఆర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.