పలు పథకాల ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం వారికి కూడా లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకుంది.
జీవన శైలి చాలా ఖరీదైపోయింది. అడుగు తీసి బయటపెడుతుంటే అప్పు చేసే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేసే ఆర్థిక సాయం పేదలకు ఉపశమనాన్ని ఇస్తుంది. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులు కొంతమేర ఉపశమనం పొందుతారని ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తుంటాయి. ఏపీ ప్రభుత్వం కూడా అనేక రకాల పథకాలను అందజేస్తుంది. పేదలకు, వృద్ధులకు, రైతులకు, విద్యార్థులకు ఇలా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుంది. అయితే తమకు కూడా రూ. లక్ష ఆర్థిక సహాయం చేయమని విజ్ఞప్తి చేసిన వారికి కూడా ఆర్థిక సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
ముస్లింలకు ఇస్తున్న షాదీ తోఫాను దూదేకులకు కూడా ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. దూదేకులను కూడా ముస్లింలుగా పరిగణిస్తూ ముస్లింలకు ఇచ్చే పథకాలను వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో దూదేకులకు షాదీ తోఫా సహా ముస్లింలకు వర్తించే అన్ని పథకాలు వర్తిస్తాయి. ఈ మేరకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్ శనివారం మెమో జారీ చేశారు. నూర్ బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్ కులస్తులకు కూడా ఇక నుంచి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రంలో ముస్లింలకు ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ షాదీ తోఫా పథకం ద్వారా రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తుంది.
అయితే ఇస్లాం మతాన్ని ఆచరించే నూర్ బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్ కులస్తులను బీసీ-బీగా పరిగణించడంతో వారికి రూ. 50 వేల ఆర్థిక సాయం మాత్రమే అందుతుంది. దీంతో తమను కూడా ముస్లింలుగా పరిగణించి లక్ష రూపాయలు షాదీ తోఫా పథకం కింద సాయం చేయాలని దూదేకుల ప్రతినిధులు ఇటీవల సీఎం జగన్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన జగన్ అధికారులతో సమీక్షించి.. దూదేకులకు కూడా షాదీ తోఫా వర్తింపజేయాలని ఆదేశించారు. అంతేకాదు.. ముస్లింలకు వర్తించే ఇతర పథకాలు కూడా వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు నూర్ బాషా, పింజరి, లద్దాఫ్ కులస్తులకు కూడా షాదీ తోఫా కింద లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వెబ్ సైట్ లో కూడా మార్పులు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.