ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం పనులు వేగం పుంజుకున్నాయి. అధికారులు ఇప్పటికే భూములను గుర్తించి మ్యాప్ కూడా సిద్ధం చేశారు. కలెక్టర్, ఆర్డీవో వారంరోజులు కృషి చేసి మొత్తం వెయ్యి ఎకరాలను గుర్తించారు. అడ్డంకి మండలంలోని తిమ్మాయపాలెం, అద్దంకి ప్రాంతాల్లో గుర్తించిన భూముల వివరాలు, మ్యాప్ ను శనివారం ఉన్నతాధికారులకు అందజేశారు. అధికారులు సిద్ధం చేసిన ప్రాథమిక నివేదిక వివరాల ప్రకారం అద్దంకి లేదా తిమ్మాయపాలెంలోనే విమానాశ్రయం రానుంది.
విమానాశ్రయం ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూమి కావాల్సి ఉంది. అందుకు తగిన విధంగా అధికారులు మ్యాప్ సిద్ధం చేశారు. వాటిలో తిమ్మాయపాలెంలోని కంకుపాడు రోడ్డుకు పడమరగా 1400 ఎకరాల భూమిని గుర్తించారు. తిమ్మాయపాలెంలో కుంకుపాడు రోడ్డునుంచి, ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నుంచి వెళ్లే డొంక మధ్యలో ఈ భూమి ఉంది. ఐతే ప్రభుత్వానికి కావాల్సిన వెయ్యి ఎకరాల్లో ఇక్కడ 311 ఎకరాలు మాత్రమే ఉంది. అంటే ఇంకా 689 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు.
అద్దంకి, బొడ్డువానిపాలెం మధ్యలో మరో 1,600 ఎకరాల భూమిని అధికారులు పరిశీలించారు. అద్దంకిలోని మేదరమెట్ల–నార్కెట్ పల్లి స్టేట్ హైవేలో ధేనువకొండ పునరావాస కాలనీ బలరామకృష్ణపురం సమీపం నుంచి, కొరిశపాడు మండలంలోని బొడ్డువానిపాలెం పొలాలను అహీకారులు పరిశీలించారు. ఆ ప్రాంతంలో గుర్తించిన అనుకూలమైన 1600 ఎకరాల్లో 109 ఎకరాలే ప్రభుత్వ భూమి ఉంది. అంటే అక్కడ విమానాశ్రయం రావాలంటే మరో 900 ఎకరాల పట్టా భూములు కొనాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అధికారుల నివేదిక ప్రకారం ఎలా చూసుకున్న ఈ రెండు ప్రాంతాల్లోనే ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు అనుకూలత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తిమ్మాయపాలెం- అద్దంకి వీటిలో ఏ ప్రాంతంలో విమానాశ్రయమా వస్తే బావుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.