పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.పుల్లారెడ్డి కుటుంబంలో గత కొంతకాలం నుంచి వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. పుల్లారెడ్డి మనవడు ఏక్ నాథ్ రెడ్డికి ఆయన భార్య ప్రజ్ఞారెడ్డికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. మామ రాఘవరెడ్డి, అత్త భారతి, మరదలు శ్రీవిద్యా గత రెండేళ్లుగా తనను, తన కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనను వరకట్నం కోసం హింసించారని, తనను, తన కుమార్తెను చంపేందుకు కూడా యత్నించారని ఆరోపించారు. తనను గదిలోంచి బయటికి రానివ్వకుండా రాత్రికి రాత్రే తలుపు దగ్గర గోడ కట్టేశారని తెలిపారు.
కోర్టు స్పందించి, ఆ గోడ కూల్చేయాలని చెప్పిందని వివరించారు. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని కోరారు. ఇక, ప్రజ్ఞారెడ్డి లేఖపై ద్రౌపది ముర్ము స్పందించారు. వేధింపుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రపతి తమ సమస్య విషయంలో.. అతి త్వరగా సానుకూలంగా స్పందించటంపై ప్రజ్ఞారెడ్డి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పుల్లారెడ్డి స్వీట్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. పుల్లారెడ్డి స్వీట్స్ బ్రాంచీలు దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఉన్నాయి. పుల్లారెడ్డికి స్వీట్స్ షాపులతో పాటు విద్యాసంస్థలు సైతం ఉన్నాయి.
పుల్లారెడ్డి మరణం తర్వాత వీటి బాధ్యతలు జి.రాఘవరెడ్డి చూస్తున్నారు. ఇక, రాఘవరెడ్డికి ఏక్ నాథ్ రెడ్డి, శ్రీ దివ్యా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు ఏక్ నాథ్ రెడ్డికి మైనింగ్ వ్యాపారి అయిన కేఆర్ఎం రెడ్డి కూతురు ప్రజ్ఞారెడ్డితో వివాహం అయింది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే పెళ్లైన ఆనతి కాలంలోనే ఏక్ నాథ్ రెడ్డికి, ప్రజ్ఞారెడ్డికి మధ్య విభేదాలు మొదలయ్యాయి. భర్త ఏక్ నాథ్ రెడ్డి, అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ప్రజ్ఞారెడ్డి గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పుల్లారెడ్డి కుటుంబ సభ్యులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో గృహహింస చట్టం కేసు నమోదైంది.