వేసవి కాలం ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదు.. అప్పుడే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో 24 గంటలు కరెంట్ ఉంటేనే.. జనాలకు కాస్త ఊరట లభిస్తుంది. లేదంటే ఉక్కపోతతో విలవిల్లాడతారు. ఇక ఆస్పత్రుల పరిస్థితి గురించి.. ముఖ్యంగా బాలింతలు, చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఏపీలో కరెంట్ కోతలు జనాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.
వేళాపాళాలేని ఈ కరెంట్ కోతల వల్ల ఏలూరు జిల్లా చింతలపూడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో దారుణమైన పరిస్థితి నెలకొంది. కరెంటు లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేళాపాళా లేని విద్యుత్ అంతరాయం వల్ల రోగులు, చంటి బిడ్డలు, బాలింతలు విలవిలలాడుతున్నారు. ఆసుపత్రిలో ఉండలేక బయటకు వచ్చి కూర్చుంటున్నారు. రాగలిగిన రోగులు ఆరు బయటకు వచ్చి కూర్చున్నా.. వారిపై దోమలు దాడి చేస్తున్నాయి. బయటకు రాలేనివారు లోపలనే మగ్గిపోతున్నారు. తెల్లవార్లూ విసురుకుంటూ కూర్చుంటున్నామని రోగులు, చంటిబిడ్డ తల్లులు వాపోతున్నారు. ఆసుపత్రిలో విద్యుత్ కోతలు లేకుండా వేరే ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రసూతి వార్డులో కరెంట్ లేదని బాలింతల బంధువులు నర్సులను, వైద్య సిబ్బందిని నిలదీస్తున్నారు. కనీసం జనరేటర్ వేయాలని కోరగా.. అది నడిచేందుకు డీజిల్ లేదని ఆసుపత్రి సిబ్బంది తేల్చి చెప్పారు. ఈ విషయం గురించి డ్యూటీలోని నర్సులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కరెంట్ లేక రోగులు నరకం అనుభవించారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.