కర్నూలు జిల్లాలో వజ్రాల వెతుకులాట మళ్లీ మొదలైంది. తొలకరి వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ఎర్ర నేలల్లో దాగి ఉన్న వజ్రాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఆ వజ్రాలను చేజిక్కించుకునేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తొలకరి వర్షాల కారణంగా కర్నూలు జిల్లాకు తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామంలో కూలీ పనిచేస్తున్న ఓ మహిళకు ఓ అరుదైన వజ్రం లభించినట్లు సమాచారం.
కొన్నేళ్లుగా కర్నూలు జిల్లాలోని తుగ్గలి, మద్దికెర ప్రాంతాలలో తొలకరి వర్షాల కురవగానే వజ్రాల వేట మొదలుపెడుతున్నారు జనాలు. ఈ వజ్రాల వెతుకులాట ఇప్పటిది కాదు.. చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. వర్షాలకు ఇక్కడి భూముల్లో వజ్రాలు మెరుస్తుంటాయి. దీంతో తెల్లవారగానే జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పొలాల్లో వాలి పోతుంటారు. తాజాగా తుగ్గలి మండలం జొన్నగిరిలో మహిళకు ఓ వజ్రం లభించింది.
ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి లక్ష రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. తొలకరి వర్షాలు పడితేచాలు.. కర్నూలు చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా జనాలు వజ్రాల వేట కోసం ఆయా ప్రాంతాలలో వాలిపోతారు. అయితే.. ప్రతిసారి ఇక్కడే ఎందుకు దొరుకుతున్నాయనే సందేహం అందరిలోనూ నెలకొంది. మరి ఆ వజ్రాలు ఎక్కడివి, ఎప్పటివి? అనంటే.. రాయలవారి కాలంలో ఇక్కడ రత్నాలు, వజ్రాలను రాశులుగా పోసి అమ్మే వారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి జొన్నగిరిని స్వర్ణగిరి అని పిలిచేవారని చెబుతారు. ఇక్కడ ఎక్కువగా పొలం పనులు చేసే కూలీలకు, రైతులకు వజ్రాలు దొరుకుతుంటాయి. తెలుపు, ఎరుపు, తేనె రంగులలో వజ్రాలు లభిస్తుంటాయి. మరి ఈ వజ్రాల వేటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.