పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ సభకు వారాహి మీద వెళ్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పవన్ రియాక్షన్ చూసిన జనాలు.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
మన దేశంలో చిన్న చిన్న చోటామోటా నాయకులు.. రోడ్డు ఎక్కితే చాలు.. వారి కోసం దారులన్ని క్లియర్‌గా ఉండాలని.. ప్రజలను ఇబ్బంది పెట్టైనా సరే తాము ముందుగా వెళ్లాలని భావిస్తారు. ఇక కీలక నేతలు, ప్రముఖులు రోడ్డు మీదకు వచ్చారంటే.. వారి కోసం గంటల తరబడి ట్రాఫిక్‌ను ఆపేసి.. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే సంఘటనలు ఎన్నో చూశాం. కానీ నాయకులు అంటే.. ప్రజలను ఇబ్బంది పెట్టేవారు కాదు. జనాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి.. వారి సమస్యలను పరిష్కరించేవాడు నిజమైన నాయకుడు. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. స్టార్ హీరో, రాజకీయ నేత అయినప్పటికి.. ముందు జనాలు.. తర్వాతే నేను అని బల్లంగా నమ్మడమే కాక ఆచరించి చూపుతారు పవన్. తాజాగా ఇందుకు ఉదాహరణగా నిలిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
జనసేన పార్టీ పదో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారు. 34 ఎకరాల ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఇక విజయవాడ నుంచి మచిలీపట్నానికి వారాహి యాత్ర దిగ్విజయంగా సాగింది. వారాహిలో ఆటోనగర్ నుంచి ర్యాలీగా బయల్దేరిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ క్రమంలో విజయవాడ – మచిలీ పట్నం హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు వారాహి ముందు 2 పోలీస్ వాహనాలతో పవన్ ర్యాలీని వేగంగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఇలా ఉండగా వారాహి యాత్రలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
ఇక జనసేన ఆవిర్భావ సభకు ఇసుకేస్తే రాలనంత మంది కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి వచ్చారు. అశేష ప్రజానీకం వెంట రాగా.. వారాహి యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగింది. ఇక వారాహి యాత్ర సందర్భంగా పెనమలూరు నియోజకవర్గం, ఈడ్పుగల్లు వద్ద.. అత్యవసర సర్వీసు అయిన అంబులెన్స్.. జనసేన సభకు వచ్చిన ప్రజల వాహనాల మధ్య చిక్కుకుపోయింది. ఇక అంబులెన్స్ అంటేనే ఎవరికో ప్రాణాపాయం అన్న సంగతి తెలిసిందే. విషయం అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి.. తన వారాహిని పది నిమిషాలు నిలిపివేసి మరీ అంబులెన్స్‌కి ముందుకి వెళ్లడానికి దారి ఇచ్చారు. రూట్ క్లియర్ చేశారు.
అంబులెన్స్ ముందుకు వెళ్లిపోయిన తర్వాత.. తిరిగి వారాహి యాత్ర కొనసాగింది. ఈ సంఘటన చూసిన అభిమానులు.. పవన్‌ను అందరూ ఎందుకు ఇంతలా ఇష్టపడతారో.. ఆరాధిస్తారో.. ఈ సంఘటనతో అర్థం అయ్యింది అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.