టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మొదటిసారి అరెస్టయ్యారు. నిన్న గుంటూరులో దారుణంగా హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించారు. రమ్య మృతదేహానికి నివాళులర్పించిన లోకేష్.. ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. రమ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా ఉంటుందని… లోకేష్ హామీ ఇచ్చారు. రమ్య నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పెద్దఎత్తున చేరుకున్న తెదేపా కార్యకర్తలను పోలీసులు లాగేశారు. రమ్య ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులను అదుపుచేసేందుకు పోలీసులు నారా లోకేష్‌ను అరెస్టు చేశారు. లోకేష్‌తో పాటు ధూళిపాళ్ల, నక్కా ఆనందబాబు, ఆలపాటిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నారా లోకేష్‌ను ప్రత్తిపాడు పీఎస్‌కు తరలించారు. ధూళిపాళ్ల, నక్కా ఆనందబాబు, ఆలపాటిను వేర్వేరు పీఎస్‌లకు తరలించారు.
రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయటం దుర్మార్గమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు చేసిన తప్పేంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. హత్యకు గురైన యువతి కుటుంబానికి పరామర్శించడం నేరమా? వారికి న్యాయం చేయమని కోరడం వారు చేసిన తప్పా అని అచ్చెన్న ప్రశ్నించారు. సీఎం బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోగా వెళ్లిన వారిని అరెస్ట్ చేయటం సిగ్గుచేటన్నారు.