గుంటూరు జిల్లాలో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కార్యాలయానికి గుర్తు తెలియని వక్తులు నిప్పు పెట్టారు. గుంటూరు డొంక రోడ్డులో ఉన్న అనిల్ ఆఫీస్ ను కొంతమంది తగలబెట్టారు. అర్థరాత్రి సమయంలో ఆఫీస్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఇటీవల బోరుగడ్డ అనిల్.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డికి అనిల్ ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఈ నేపథ్యంలో అనిల్ ఆఫీస్ కి కొంతమంది నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కార్యాలయంలో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. కాగా ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆరుగురు వ్యక్తులు వచ్చి పెట్రోల్ పోసి ఆఫీస్ కి నిప్పు పెట్టి.. అనంతరం తనపై దాడి చేసినట్లు వాచ్ మేన్ ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోటంరెడ్డి మీద, టీడీపీ నేతల మీద అనిల్ ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ కుమార్.. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. రెండు రోజుల క్రితం కోటంరెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోటంరెడ్డి లాంటి వాళ్ళు జగన్ కాలి గోటి మట్టితో సమానమని అన్నారు. సీఎం జగన్ కోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధమని అన్నారు.
జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే బండికి కట్టి లాక్కెళ్తానని ఫోన్ లో కోటంరెడ్డిని బెదిరించారు. చంద్రబాబు తన బినామీ సొమ్ముతో వైసీపీ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. తాను వైఎస్సార్ పార్టీకి, వైఎస్ జగన్ కు వీరాభిమాని అని, జగన్ పై అవాకులు, చవాకులు పేలితే.. కుక్కను కొట్టినట్టు కొట్టి రోడ్డున ఈడ్చుకు వస్తానని కోటంరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. బోరుగడ్డ చేసిన వ్యాఖ్యల అనంతరం ఆయన ఆఫీస్ కు నిప్పు పెట్టారు. మరి నిప్పు ఎవరు పెట్టారు? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.