ఏపీలో వైసీపీ అధికారం చేపట్టినప్పటినుంచి మద్యపానం నిషేధం వైపుగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఏడాదికేడాది మందు షాపుల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. ఈ చర్యలు మందుబాబులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. మొన్నటి దాకా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బ్రాండ్లపై విమర్శలు రాగా.. ఇపుడు ఏకంగా షాపుల సంఖ్య తగ్గించడం వల్ల మందుకు దూరమవుతున్నామని మందుబాబులు ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నారు. తాజాగా.. ఒక మందుబాబు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఏకంగా కలెక్టర్ కు ఫోన్ చేసి.. తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆ వివరాలు..
గుంటూరుజిల్లా చేబ్రోలుకి చెందిన ఓ మందుబాబు ఆవేదన అంతా ఇంతా కాదు. తాగుదామంటే పక్కన మందు షాపులు లేవు.. ఉన్న ఒక్క మద్యం షాపులోనూ నిత్యం రద్దీ. దీన్ని సహించలేకపోయాడు. పరిష్కారం కోసం ఏకంగా కలెక్టర్ కు ఫోన్ కొట్టాడు. స్థానికంగా మద్యం షాపు లేదని.. దయచేసి తమకు దగ్గరగా ఉండేలా ఒక మద్యం దుకాణం ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశాడు. ఉన్న ఒక్క షాపుతో ఇబ్బంది పడుతున్నామని.. నిత్యం రద్దీగా ఉండడం వల్ల మందు కొనుక్కోలేక పోతున్నామని తెలిపాడు. క్యూలైన్లో ఉండలేక.. మద్యానికి దూరం అవుతున్నామని.. మరో షాపు ఏర్పాటు చేయాలని డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో కలెక్టర్ వివేక్ యాదవ్ ని కోరాడు. మందుబాబు ఆవేదనపై కలెక్టర్ వివేక్ యాదవ్ స్పందించారు. ఆ మందుబాబుని మద్యం మానేయాలని సూచించాడు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఇలాంటి ప్రశ్నలు అడగకూడదని సూచించి కాల్ కట్ చేశాడు