ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, నిద్రలేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం లాంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సంగం వద్ ఓ లారీ.. ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరాపేరు వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో సమయంలో ఆటోలో 15 మంది ఉండగా వారిలో ఒక పాప మృతి చెందింది. ఐదుగురు వాగులో గల్లంతయినట్లు సమాచారం. మిగతావారిని స్థానికులు, రిస్క్యూ టీమ్ కాపాడారు.
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు జ్యోతినగర్‌కు చెందిన కె. నాగభూషణం కుటుంబ సభ్యులు సంగంలోని సంగమేశ్వరాలయంలో నిద్ర చేసేందుకు ఆటోలో బయలుదేరారు. బీరాపేరు వాగు వంతెనపైకి ఆటో చేరుకున్న సమయంలో ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఒకదాన్నొకటి ఓవర్ టేక్ చేసే క్రమంలో ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. ఆటో కిందనున్న వాగులోకి పడిపోయింది.
ఆ సమయంలో అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. అలా వారు స్పందించడంతో కొంత మంది ప్రాణాలను కాపాడిన వారు అయ్యారు. వీరిలో 14 ఏళ్ల నాగవల్లి అనే బాలిక మృతి చెందింది. కాగా, బాధితులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.