రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
ఎడతెరిపి లేకుండా వర్షాలతో హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులు అవుతున్నాయి. ఈ వరద నీరంతా హుస్సేన్ సాగర్ లో చేరుతుంది. దీంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ ని దాటేసింది. ఫుల్ ట్యాంక్ అసలు సామర్థ్యం 513.45 మీటర్లే కాగా.. ప్రస్తుతం వరద నీరు చేరడంతో 514.75 మీటర్లు ఉంది. మరోవైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లలోకి కూడా భారీగా వరద నీరు చేరుతుంది. ఉస్మాన్ సాగర్ నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1784.70 అడుగులకు చేరింది. ఉస్మాన్ సాగర్ లో ప్రస్తుతం 1100 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. హిమాయత్ సాగర్ లోకి 1200 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ నీటి మట్టం 1761.20 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులుగా ఉంది.
ఇదిలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వలిగొండ మండలం సంగం పరిధిలో మూసీ వంతెన మీద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు బొల్లేపల్లి-చౌటుప్పల్ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. రుద్రవెల్లి వద్ద కాజ్ వే మీద నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో పోచంపల్లి-బీబీనగర్ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వికారాబాద్ జిల్లా కేంద్ర ప్రాంతంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వికారాబాద్ కు వచ్చే పరిగి రోడ్డు మార్గంలో వాగు పొంగి ప్రవహిస్తుంది. మరోవైపు గెట్టిగింట్ పల్లి రైల్వే వంతెన వద్ద వాగు ప్రవహిస్తుండడంతో మదనపల్లి, కొంపల్లి, గిరిగంటిపల్లి తదితర గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ధరూర్ వద్ద కాగ్న వాగు, గోధుమగూడ మీదుగా మోమిం కలన్ తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు అయిన గోధుమ గూడ రైల్వే ఖానా వంతెన మీద వాగు ప్రవహిస్తోంది. జైదుపల్లి వద్ద రైల్వే లైన్ కింద రోడ్డుపై వాగు పొంగిపొర్లుతుంది. దీంతో నాగారం, మైలారం, నాసనపల్లి తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.