మనం కష్టపడి సంపాదించింది ఎంత పోయినా బాధ లేదు కానీ ఏదైనా సరే ఫ్రీగా వస్తుంది అంటే ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. అందుకే అంటారు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు అని.. ఇప్పుడు అదే తీరుగా ఉంది.. కాకినాడ ఉప్పాడ సముద్ర తీరంలో జనాల పరిస్థితి. ఏపిలో అసాని తుఫాన్ బీభత్సం కొనసాగిస్తుంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలను బయటకు రావొద్దని సూచించింది.
ఓ వైపు తుఫాన్ అతలాకుతలం చేస్తుంటే.. ఉప్పాడ బీచ్ సమీపంలో బంగారం దొరకుతుందనే ప్రచారం జరుగుతుంది. భారీగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉప్పాడ బీచ్ లో బంగారం కోసం వేట ప్రారంభించారు. సముద్ర తీరం వెంట చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా మొత్తం జల్లెడ పడుతున్నారు.
ఈ విషయం గురించి స్థానికులు మాట్లాడుతూ.. తుఫాన్లు వచ్చినపుడు సముద్రం లో నుంచి చిన్న బంగారు రేణువులు, వెండి వస్తువులు లాంటివి కొట్టుకు వస్తాయని వాటిని తీసుకునేందుకు జనాలు ఎగబడతారని అన్నారు. గతంలోని రాజుల కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని.. అప్పట్లో దాచుకున్న అమూల్యమైన వస్తువు తుఫాన్ సమయంలో సముద్రం నుంచి తీరానికి కొట్టుకు వస్తాయని.. మత్స్యకారులు చెబుతున్నారు. ఇది తమకు కొత్తేమీ కాదని అంటున్నారు.
ఇదిలా ఉంటే అధికారులు మాత్రం ఇది ఒట్టి మాటలు అని.. భారీగా కురుస్తున్న వర్షాలకు చాలా నివాసాలు కొట్టుకు పోవడం.. మనుషులు చనిపోతే వారి పై ఉన్న బంగారు వస్తువులు ఉంటే సముద్రంలో కలిసి తుఫాను సమయంలో కొట్టకు వస్తుంటాయి. అలాంటి వస్తువులు చూసి సముద్రం లో నుంచి వస్తున్నాయని మత్స్యకారులు భావిస్తున్నారని.. సముద్రం లోపల నుండి బంగారం రావడం మాత్రం వాస్తవం కాదని చెబుతున్నారు.