అయ్యప్ప భక్తులు, బిహారీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బెర్తుల విషయంలో ఇరు వర్గాలు గొడవకు దిగాయి. దీంతో కృష్ణ కెనాల్ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాదాపు అరగంట పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆర్‌పీఎఫ్ పోలీసులతో పాటు తాడేపల్లి పోలీసులు కూడా రంగంలోకి దిగి గొడవను సద్దుమణిగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శబరిమలకు వెళ్తున్న కొంతమంది భక్తులు రాప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్‌లో కొన్ని రోజుల ముందే బెర్తులు రిజర్వేషన్ చేయించుకున్నారు. శబరిమలకు వెళ్లాల్సిన రోజు రావటంతో రైల్వే స్టేషన్‌కు వచ్చారు.
రాప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఎక్కారు. అయితే, తమ సీట్ల దగ్గరకు వెళ్లగా.. అప్పటికే వాటిలో బిహార్‌కు చెందిన వాళ్లు కూర్చుని ఉన్నారు. దీంతో అయ్యప్ప భక్తులు వారిని లేవాల్సిందిగా కోరారు. కానీ, బిహార్ ప్రాంత ప్రయాణికులు వీరి మాటను లెక్కచేయలేదు. దీంతో రెండు వర్గాల మధ్యా గొడవ మొదలైంది. అయ్యప్ప భక్తులు కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ వద్ద చైన్‌ను లాగారు. రైలు ఆగిపోయింది. అక్కడ కూడా ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గొడవ కారణంగా రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఆర్‌పీఎఫ్ పోలీసులతో పాటు, పోలీసులు కూడా అక్కడికి వెళ్లారు.
గొడవను ఆపి ఎవరి సీట్లలో వారిని కూర్చోనిచ్చారు. బిహార్ వాళ్లను విజయవాడకు పంపేశారు. ఈ గొడవ నేపథ్యంలో దాదాపు అర గంట పాటు రైల్వే స్టేషన్‌లోనే నిలిచిపోయింది. కాగా, శబరిమల వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలంటూ కొందరు అయ్యప్ప స్వాములు, భక్తులు ఆందోళనకు దిగారు. విజయవాడలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఎదుట నిరసనలు తెలియజేశారు. ప్రతీ సంవత్సరం శబరిమల వెళ్లే భక్తుల కోసం జనవరి నెలలో ప్రత్యేక రైళ్లు నడిపేవారని, ఈసారి డిసెంబర్ వచ్చిన రైళ్లు అందుబాటులోకి తేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరి, అయ్యప్ప భక్తులు, బిహారీల మధ్య గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.