చాలా మంది చదువు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రభుత్వం ఉద్యోగం అనేది చిరకాల స్వప్నంగా భావిస్తుంటారు.
ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే తలకు మించిన భారం అనే చెప్పాలి. కొంతమందికి అన్ని అర్హతలు ఉన్నా అదృష్టం మాత్రం తలుపు తట్టదు అంటారు. ఉన్నతాధికారి అయినా.. చిన్న ప్యూన్ ఉద్యోగం అయినా ప్రభుత్వ ఉద్యోగి అని గర్వంగా చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని తపన, కోరిక ఉంటుంది. కొన్నిసార్లు అదృష్టం కనికరించనా.. అప్పటికే వయసు మించిపోతుంది. అచ్చం ఇలాంటి పరిస్థితి ఓ టీచర్ కి వచ్చింది. ఎళ్ల తరబడి వేచి చూసిన టీచర్ ఉద్యోగం వచ్చింది.. కానీ ఆయనకు కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే ఉద్యోగం చేసే అవకావం లభించింది. ట్విస్ట్ ఏంటంటే.. ఆయన తన తొలి జీతం తీసుకోకుండానే పతవీ విరమణ చేశారు. వివరాల్లోకి వెళితే..
గుంటూరు జిల్లా నరసరావు పేటకు చెందిన పద్మాకర్ రావు 98 డీఎస్సీ అభ్యర్థి. ఎంతో కష్టపడి చదివి డీఎస్సీ క్వాలిఫై అయ్యారు పద్మాకర్ రావు. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నులు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇటీవల ఏపీ ప్రభుత్వం భర్తీలు చేయడంతో నాన్ లోకల్ క్యాడర్ 104 ర్యాంక్ లో అల్లూరి ఏజెన్సీలో ఉద్యోగం సంపాదించాడు. అది కూడా మినిమం టైమ్ స్కేల్ లెక్కన. మొదటి కౌన్సిలింగ్ లో పాడేరు మండలం గున్నగుమ్మి గ్రామం స్కూల్ లో ఈ సంవత్సరం ఏప్రిల్ 17న ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ నెల 30 వరకు విధులు నిర్వహించారు.. విద్యా సంవత్సరం పూర్తి కావడంతో ఏడాదికి పదవీ కాలం ముగిసింది.
పద్మాకర్ రావు ఈ ఏడు విద్యా సంవత్సరంలో మరోసారి రెండవ విడత కౌన్సిలింగ్ లో జీ మాడుగుల మండలం కే కోడాపల్లి మండలం ఉన్నత పరిషత్ స్కూల్ లో జూన్ 27న విధుల్లో చేరారు. పిల్లలకు ఎంతో సంతోషంగా విద్యాభోదన చేశారు. ఆ అదృష్టం పద్మాకర్ రావు కి ఎంతోకాలం ఉండలేదు. కేవలం ఉపాధ్యాయుడిగా నెల రోజులు మాత్రమే కొనసాగారు. జులై 27న వయసుమీరడంతో పదవీ విరమణ చేశారు. విచిత్రం ఏంటంటే.. పద్మారావు తన మొదటి జీతం కూడా తీసుకోలేదు.. అప్పటికే రిటైర్ మెంట్ అయ్యారు. పదవీ విరమణ చేసిన పద్మాకర్ రావు కి సహ ఉపాధ్యాయుడులు సన్మానం చేశారు. ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదని.. పద్మారావు సార్ అందరితో బాగా కలిసిపోయారని అన్నారు సహ ఉపాధ్యాయులు. ఆయన స్కూల్ లో విధులు నిర్వహించిన కాలానికి వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు సహచరులు ఉపాధ్యాయులు. తమ మాస్టార్ వెళ్లిపోతుంటే విద్యార్థులు ఒక్కసారే కన్నీరు పెట్టుకున్నారు.