తన ఫోన్ ట్యాప్ చేశారు.. అధినేతకు తనపై నమ్మకం లేదు.. ఇలాంటి చోట తాను ఉండనంటూ.. సొంత పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేసి సంచలనం సృష్టించాడు నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ప్రస్తుతం ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ వేడి రాజేయగా.. తాజాగా చోటు చేసుకున్న పరిణామంతో ఈ హీట్ మరింత పెరిగింది. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కేసు నమోదయ్యింది. తనతో పాటు పార్టీ మారలేదన్న కోపంతో.. ఓ కార్పొరేటర్‌ని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తన అనుచరులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. సదరు కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కేసు నమోదయ్యింది. ఆ వివరాలు..
శ్రీధర్‌రెడ్డి.. పడారుపల్లికి చెందని నెల్లూరు నగరం 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డికి శుక్రవారం ఫోన్ చేసి.. వైసీపీ పార్టీని వీడి తనతో పాటు రావాలని కోరారు. అయితే విజయ్ భాస్కర్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. దాంతో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్, కారు డ్రైవర్ అంకయ్యతో కలిసి కార్పొరేటర్ విజయ్ భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లి.. తన అంతు చూస్తామంటూ బెదిరించారు. అంతేకాక కార్పొరేటర్‌ని బలవంతంగా కారులో ఎక్కించేందకు ప్రయత్నించగా.. ఆయన ప్రతిఘటించారు. వారి నుంచి తప్పించుకుని.. వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. కోటంరెడ్డిపై ఫిర్యాదు చేశాడు కార్పొరేటర్ విజయ్ భాస్కర్‌రెడ్డి.
ఇక కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరుడు, కారు డ్రైవర్ అంకయ్యపై కేసు నమోదు చేసినట్లు వేదాయపాలెం పోలీసులు వెల్లడించారు. మరి కోటంరెడ్డి.. తనతో పాటు పార్టీ మారాలని బలవంతం చేయడం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.