ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రోడ్ షోలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ, ఏపీ సీఎంతో సహా అందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలు పోవడానికి చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చే కారణమంటూ కొందరు తీవ్ర స్థాయిలో విమర్శస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు, మంత్రులు చంద్రబాబును విమర్శిస్తున్నారు. అలానే ఈ ఘటన ఏపీలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఈ ఇష్యూలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా చేరారు. కందుకూరు పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. అంతేకాక అమాయకుల ప్రాణాలను పొట్టను పెట్టుకున్న చంద్రబాబు.. తన పదవికి రాజీనామా చేసి.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీలోని జిల్లాల పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం నెల్లూరు జిల్లాలోని కందుకూరులో పర్యటించారు. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో సభ నిర్వహించారు. చిన్నగా ఉన్న ఆ రోడ్డులో వేల సంఖ్యలో జనం గుమిగూడారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా కొంతమంది ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. కిందపడ్డవారిపై నుంచి జనం పరుగులు తీశారు. దీంతో ఎనిమిది మంది చనిపోగా.. మరికొంతమంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ప్రముఖులు స్పందించారు. అలానే తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కందుకూరు ఘటనపై స్పందించారు. అంతేకాక నేరుగా కందుకూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. చంద్రబాబు నాయుడిపై ఫిర్యాదు చేశారు. ఇరుకు సందులో రోడ్ షో నిర్వహించి.. అమాయకుల మృతికి కారణమైన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన కందుకూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
పోలీస్ స్టేషన్ కు వెళ్లే ముందు. ఘటనా స్ధలిని కేఏ పాల్ సందర్శించారు. పీఎస్ వెళ్లి చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. “నాలుగైదు వేల మంది పట్టే ప్రాంతానికి యాభై, అరవై వేల మందిని ఎలా పిలిచారు. బిర్యానీ, మందు ఎంత పంచినారు. ఇలా చేయడం అవినీతా? కాదా? అలాంటి విషయంపై పోలీసులు తప్పక దర్యాప్తు చేయాలి. ఇక్కడ ఎవరి కార్యకర్తలు అనేది ముఖ్యం కాదు. ఎనిమిది మంది ప్రాణాలు బలయ్యాయి. ఆ ప్రాణాలకు లక్ష, పది లక్షలు ఇస్తే సరిపోతుందా? డబ్బుతో మీరు ప్రాణాలు కొంటారా?. ఓట్ల కోసం అయితే మూడు వందలు, ఐదు వందలు ఇవ్వడం.. ప్రాణాలు పోతే లక్ష, పది లక్షలు ఇవ్వడం ఏంటి?” అని ప్రశ్నించారు.
ఇంకా పాల్ మాట్లాడుతూ.. “ఎంతో అనుభవం ఉన్నదని చెప్పుకునే చంద్రబాబు.. ఆయన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు. అంతేకాక ఇతర సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన చంద్రబాబు.. అవేవీ పట్టించుకోలేదు. అసలు ఇప్పుడు కరోనా వ్యాపిస్తున్న సమయంలో ఇలా వేలమందితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇలాంటి చర్యలకు సిగ్గుపడాలన్నారు. ఈ ఘటనకు ఆయన బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలి. ఆయనపై సెక్షన్ 304 ఏ, సెక్షన్ 174 కింద పోలీసులు కేసు నమోదు చేయాలి” అంటూ కేఏ పాల్ తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఈఘటనపై పోలీసులు దర్యాప్తు నిర్వహించి నిజానిజాలు వెలికి తీయాలని కేఏ పాల్ కోరారు. మరి.. చంద్రబాబు పై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.