ప్రముఖ తెలుగు కవి, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు తెలుగు భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. తెలుగు భాష అంటే తెలంగాణ భాష అనిపించుకుంటున్నామని అన్నారు. విజయవాడలో మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఆయన
ప్రముఖ తెలుగు కవి, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు తెలుగు భాషను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. విజయవాడలో మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఆయన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు భాష అంటే తెలంగాణ భాష అనిపించుకుంటున్నామని, ఇప్పుడు తెలంగాణ వార్తలు వినాల్సి వస్తుందని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తెలంగాణ భాష వినడం అవసరమంటారా అంటూ ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందని అన్నారు. మన భాషను మనమే విస్మరించామన్నారు. మనది అద్భుతమైన భాష అంటూ కొనియాడారు. తెలంగాణలో మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం యాసలో ఏమీ తేడా ఉండదని, ఇదంతా తెలంగాణ భాష అని అనుకుంటామన్నారు.
జై తెలుగు అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన ఐదు రంగుల్లో జెండా ఉండనుందని తెలిపారు. తెలుగు భాషపై మాట్లాడుతూ.. ‘మన ఏపీలో యాస ఒకేలా ఉండదు. శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతాల్లో ఉండే యాస స్పష్టంగా తెలుస్తుంది ఇది ఉత్తరాంధ్ర భాష అని, అలాగే గోదావరి జిల్లాల యాస తెలుస్తుంది. అలాగే కృష్ణా, గుంటూరు.. జిల్లాల్లో ఎవరైనా మాట్లాడితే.. మీది బెజవాడా, గుంటూరా అని అడుగుతారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్ల భాష ఒక ప్రత్యేకమైన సొగసు, దానిలో ఓ మాధుర్యం ఉంటుంది. ఇక అనంతరపురం, కడప, కర్నూలు ఆ భాషల మాధుర్యం వాటికి ఉంది. ఐదు యాసలు ఉన్నాయి. ప్రపంచం చేత ఆహా అనిపించేలా కొంత మంది మహానుభావులు.. విలువైన సాహిత్యం, సంపదలను సృష్టిచ్చి ఇస్తే మనం ఈ రోజు దాని గురించి మాట్లాడుకోవట్లేదు.’అన్నారు. తమ తర్వాతి తరం వారికి భాష, సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసేలా రాజకీయ నాయకులు, పాలకులు పూనుకోవాలని కోరారు. మీరు తెలుసుకుని, ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఆ ఉద్దేశంతోనే తాను పార్టీని ఏర్పాటు చేస్తున్నానన్నారు.