గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేత వ్యవహారం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వమే కూల్చివేతలకు పాల్పడిందని జనసేన ఆరోపిస్తోంది. తమ పార్టీ సభకు భూములిచ్చారన్న కారణంగానే.. ఇప్పటం గ్రామంలోని పలువురి ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసిందంటూ జనసేన ఆరోపించింది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. ఇళ్లు కూల్చివేతకు గురైన ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ తరపున అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులను ఓదార్చిన పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా బాధితులకు అందజేస్తారని వెల్లడించారు.
ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించిన శ్రీ @PawanKalyan గారు – JanaSena Party PAC Chairman Shri @mnadendla pic.twitter.com/yrAFw93Sfz
— JanaSena Party (@JanaSenaParty) November 8, 2022