ఏపీలో అసనీ తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీకాకుళం జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సంతబొమ్మాళి మండలం, ఎం సున్నాపల్లి సముద్రతీరానికి ఒక రథం కొట్టుకువచ్చింది. బంగారు వర్ణం కలిగిన రథం అక్కడి ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. ఆ రథాన్ని అక్కడ ఉన్న కొంత మంది తాళ్ళతో కొట్టి ఒడ్డుకు లాగుతూ వచ్చారు. తీరంలో బంగారు వర్ణం రథం గురించి తెలియగానే అదో పెద్ద వింత వస్తువులా స్థానికులు వీక్షించేందుకు భారీ సంఖ్యలో సున్నాపల్లి రేవుకు చేరుకున్నారు. జనం ఎగబడుతుండటంతో దీనికి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.
తుఫాను సమయంలో సముద్రం నుంచి ఇలాంటి చిత్ర విచిత్రమైన వస్తువులు కొట్టుకొని వస్తుంటాయి. కానీ ఇలాంటి వస్తువు చూడటం ఇదే మొదటి సారి అని అంటున్నారు మత్స్యకారులు, స్థానికులు. ఇది మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు భావించారు. అయితే ఈ స్వర్ణ రథం మిస్టరీ వీడిపోయింది.
ఈ బంగారు వర్ణం ఉన్న రథాన్ని అధికారులు పూర్తిగా పరీక్షించారు.. ఇది మయన్మార్ నుంచి తీరానికి కొట్టుకు వచ్చినట్లు తెలిపారు. సాధారణంగా మయన్మార్‌లో ఎవరైనా యువతీయువకులు బౌద్ధమతంలో చేరి సన్యాసం స్వీకరించే సమయంలో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. వాటిని సముద్రంలో వదిలి వేస్తారు. ఇటీవల వచ్చిన తుఫాను కారణంగా ఇక్కడికి కొట్టుకు వచ్చిందని అధికారులు అంటున్నారు. ఇలాంటి రథాన్ని శ్రీకాకుళంలో చూడటం ఇదే మొదటి సారి అంటున్నారు.
ఊరేగింపు నిర్వహించిన తర్వాత ఈ వాహనాన్ని సముద్రంలో నిమజ్జనం చేసి ఉంటారు. ఇది 16-1-2022 అంటూ మయన్మార్ భాషలో లిఖించారు. అంటే బహుషా ఈ రథాన్ని నాలుగు నెలల క్రితమే రూపొందించి ఉంటారు అందుకే అది కొత్తగా కనిపిస్తోంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.