ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడీవేడిగా ఉంటాయి. అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అలానే రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఇరు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 175కి 175 సీటు గెలుచుకోవాలనే లక్ష్యంతో అధికార పార్టీ వైసీపీ ముందుకు సాగుతోంది. అలానే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఈక్రమంలోనే ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ’ అనే కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ‘ఇదేం ఖర్మా’లో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో పర్యటించారు. ఈక్రమంలోనే చంద్రబాబు రూ.2 వేలు పెట్టి అరటిపళ్లను కొనుగోలు చేశారు.
రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు విన్నూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లారు. అలానే ఇటీవల ఇదేం ఖర్మ అనే మరో కార్యక్రమంతో మరోసారి ప్రజల్లోకి వెళ్లారు. అందులో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు వంటి ప్రాంతాల్లో పర్యటించారు. ‘ఇదే ఖర్మ’ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. రాజాం నుంచి బొబ్బిలి వెళ్లే రహదారిలో అరటిపండ్లు అమ్ముకునే వ్యక్తి వద్ద చంద్రబాబు ఆగారు. అతడితో కొద్ది సమయం పాటు ముచ్చటించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాక ఆ వ్యక్తి వద్ద నుంచి రూ.2వేలతో అరటిపళ్లు కొని అక్కడున్న చిన్న పిల్లలకు, స్థానికులకు పంచారు. తర్వాత బాడంగి మండలం రేజేరులో బెల్లం బట్టీని పరిశీలించారు.
ఇక ఆయన తనయుుడ, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ విషయానికి వస్తే.. జనవరి 27 నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేయనున్నారు. 4 వేల కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనున్నట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. టీడీపీ కంచుకోటల్లాంటి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు తండ్రీకొడులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మొదట చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే అధికార పార్టీ.. విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది. ఇక్కడి నుంచి పరిపాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇటువంటి పరిణామాల మధ్య మూడు జిల్లాల ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారనేది అందరిలో ఆసక్తిని పెంచింది. మరి.. చంద్రబాబు విజయనగరంలో సాగిస్తున్న పర్యటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.