పెళ్లి రిసెప్షన్ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. డ్యాన్స్ చేస్తుండగా ఇంజనీరింగ్ విద్యార్థి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు.
పెళ్లి వేడుకలు, పార్టీలు అంటే యువకుల హడావుడి, సందడి, ఆటపాటలు, డ్యాన్సులు ఓ రేంజ్ లో ఉంటాయి. పెద్దలే యూత్ లా మారి డ్యాన్సులు, చిందులు వేస్తూ సందడి చేస్తుంటే ఉడుకు రక్తం ఉన్నోళ్లు ఏ రేంజ్ లో సందడి చేస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే దురదృష్టవశాత్తు వేడుకల్లో డ్యాన్సులు చేస్తూ కుప్పకూలిపడిపోతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోవడం, గుండెపోటు రావడం వంటివి జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. వయసులో పెద్దవాళ్ళు, చిన్నవాళ్లు కూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. తాజాగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థి పెళ్లి రిసెప్షన్ వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలిపడిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలుకి చెందిన శ్రీనివాస రెడ్డి కుమారుడు సత్యసాయి రెడ్డి (21) తమిళనాడులోని శ్రీపెరంబుదూరులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. తురైపాక్కంలో ఉంటూ కాలేజ్ కు వెళ్తున్నాడు. అయితే కోయంబేడులో తన స్నేహితురాలి సోదరి పెళ్లి రిసెప్షన్ ఉందంటే వెళ్ళాడు. ఈ వేడుకలో పెళ్లికూతురు స్నేహితులు కూడా హాజరయ్యారు. అంతా కలిసి ఆటపాటలతో సందడి చేశారు. ఈ క్రమంలో సత్యసాయి రెడ్డి కూడా డ్యాన్స్ చేశాడు. అందరూ మాంచి ఊపొచ్చే పాటకు డ్యాన్సులు చేస్తున్నారు. సత్యసాయి రెడ్డి కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఉన్నట్టుండి డ్యాన్స్ చేస్తుండగానే మధ్యలో కుప్పకూలిపడిపోయాడు.
చెవిలోంచి రక్తం వచ్చింది. స్నేహితులు భయంతో తట్టి లేపే ప్రయత్నం చేసినా స్పృహ లేదు. దీంతో స్నేహితులు వెంటనే అన్నానగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సత్యసాయి రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ కుటుంబంలో ఒకడిగా కలిసిపోయి వారికి సాయం చేస్తూ వచ్చిన స్నేహితుడు, తమతో పాటు సరదాగా డ్యాన్స్ చేసిన స్నేహితుడు ఉన్నట్టుండి ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు వదిలేయడంతో అతని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సత్యసాయి రెడ్డి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కాగా సత్యసాయికి ఫిట్స్ ఉన్నట్లు తెలిసింది.