ఇటీవల్ భూకంపం టర్కీ, సిరియా దేశాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అయితే టర్కీ, సిరియా తరహా భూకంపం మన దేశంలోనూ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఇటీవలే హెచ్చరించారు. అయితే తాజాగా కర్నూలులో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం సంభవించడంతో 50 వేల మందికి పైగా మరణించారు. అయితే భూకంప ప్రభావం మన దేశంలోనూ ఉందని శాస్త్రవేత్తలు చెప్పడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దేశంలో పలు ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో భూమి కంపించింది. జిల్లాలోని తుగ్గలి మండలం రాతన గ్రామంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సోమవారం రాత్రి సమయంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
దీంతో జనం ఇళ్ళ లోంచి బయటకు పరుగులు తీశారు. రాత్రంతా రోడ్లపైనే జాగరణ చేశారు. మళ్ళీ ఎక్కడ భూప్రకంపనలు చోటు చేసుకుంటాయో అన్న భయంతో తెల్లవార్లూ బయటే ఉన్నారు. ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపైనే ప్రజలు జాగరణ చేశారు. భూప్రకంపనల కారణంగా ఇళ్ళు, రోడ్లు బీటలు పడ్డాయని స్థానికులు పేర్కొన్నారు. సుమారు 14 ఇళ్లకు బీటలు పడ్డాయని, సిమెంట్ రోడ్డుకు పగుళ్లు ఏర్పడ్డాయని చెబుతున్నారు. అయితే ఈ భూకంపం తీవ్రత ఎంత ఉందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రిక్టర్ స్కేలుపై ఎంత నమోదైంది, ఆస్తినష్టం ఎంత జరిగింది అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. భూకంపం ప్రభావిత గ్రామంలో అధికారులు, స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి పర్యటించారు. భూప్రకంపనలు గురైన ఇళ్లను పరిశీలించారు.
గతంలో ఎన్టీఆర్ జిల్లాలో కంచికర్ల, చందర్లపాడు, నందిగామ, వీరులపాడు తదితర మండలాల్లో భూమి కంపించింది. పల్నాడు జిల్లాలోని పలు మండలాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. గతంలో ఇలాంటి స్వల్ప భూకంపాలు వచ్చినా జనాలు పెద్దగా భయపడలేదు. అయితే టర్కీ, సిరియా దేశాల్లో ఇటీవల భారీ భూకంపం సంభవించడంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు భారతదేశంలో కూడా టర్కీ, సిరియా తరహాలో భూకంపం వస్తుందని చెప్పడంతో ప్రజలు భయపడుతున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.