స్పా, మసాజ్ సెంటర్లు వంటి సంస్కృతిపై అధికారులు కొరడా ఝళిపించనున్నారు. గడిచిన కొన్ని నెలల్లో మసాజ్ సెంటర్ల పేరిట వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినా కూడా ఎక్కడోోచోట స్పా సెంటర్లలో చట్ట వ్యతిరేక చర్యలు జరిగాయి. స్పా ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కలెక్టర్ దిల్లీరావు హెచ్చరించారు. అధికారులు స్పా సెంటర్లపై నిఘా పెట్టి చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారి లైసెన్సులు రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ 1956 యాక్ట్ అమలు, పర్యవేక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ, ఐసీడీఎస్ కార్మిక, పోలీసు అధికారులు పాల్గొన్నారు. “గత సమీక్ష సమయానికి 11 కేసులు నమోదయ్యాయి. ఈ 15 రోజుల్లో మరో 7 కేసులు నమోదవడం ఎంతో దురదృష్టకరం. స్పా, మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లలో యువతను ఆకర్షింపజేసి.. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు కేసులు నమోదవుతున్నాయి. వాటిపై పటిష్ట చర్యలు తీసుకోలేదు” అంటూ కలెక్టర్ దిల్లీరావు అసహనం వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో పులువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇకపై స్పా, మసాజ్ సెంటర్లపై పకడ్బందీ నిఘా ఏర్పాట్లు చేసి, కఠిన చర్యలు తీసుకోకున్నట్లు అధికారులు వెల్లడించారు.