అమరావతి- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రాజుకుంటోంది. కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు మాటల యుధ్దాన్ని కొనసాగిస్తున్నాయి. ఏపీ అక్రమంగా రాయలసీమ ఎత్తుపోతలు, రాజోలిబండ కెనాల్ ప్రాజెక్టులన నిర్మిస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ కు తెలంగాణ సర్కార్ లేఖ రాయడంతో వివాదం మరింత ముదిరింది. కేసీఆర్ సర్కార్ లేఖను పరిగణలోకి తీసుకున్న కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ రాయలసీమ ఎత్తిపోతల పధకం పనులను వెంటనే ఆపాలని ఏపీ ప్రభుత్నాన్ని ఆదేశించింది.
మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ వద్ద తెలంగాణ పూర్తి స్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున సాయుధ బలగాలను అక్కడ మోహరించింది కేసీఆర్ సర్కార్. ఇప్పుడిప్పుడే శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద చేరుతున్న నేపధ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే, ఏపీలో పంటలకు నీరందేదెలా అని జగన్ సర్కార్ ప్రశ్నిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
అమరావతిలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నానని, మన వాళ్లను ఇబ్బంది పెడతారనే నేను ఎక్కువగా మాట్లాడటం లేదని సీఎం వ్యాఖ్యానించారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలని జగన్ ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని, నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. విద్యుత్ విషయంలో మరోసారి కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ కు లేఖ రాయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.