ఆలయాల్లో ఒక్కో దగ్గర ఒక్కో విధమైన ఆచార, వ్యవహారాలు ఉంటాయి. వీటిలో కొన్ని బాగుంటే, కొన్ని మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి ఓ ఆచారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘అరుంధతి’ సినిమాలో మాదిరిగా భక్తులు తలపై కొబ్బరికాయలు కొట్టించుకున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన ‘అరుంధతి’ చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ మూవీతో అనుష్క బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ‘అరుంధతి’ సూపర్ హిట్టవ్వడంతో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ తెలుగులో బాగా పెరిగాయి. అయితే ఈ సినిమాలో ఓ భయంకరమైన సీన్ గుర్తుండే ఉంటుంది. జేజమ్మ పాత్రధారి అనుష్క తన తలపై కొబ్బరికాయలు కొట్టించుకోవడాన్ని ఆడియెన్స్ అంత సులువుగా మర్చిపోలేరు. తలపై చిన్న దెబ్బ తాకితేనే తట్టుకోలేం. అలాంటిది టెంకాయల ధాటికి మాడు పగిలి రక్తం ధారగా కారే ఆ సీన్‌ను తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అయితే అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి నిజ జీవితంలోనూ జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గంలో కొంత మంది తమ తలపై కొబ్బరి కాయలు కొట్టించుకున్నారు. గంగవరం మండలంలోని బీరగాని కురప్పల్లి గ్రామంలో కురవ కులస్తుల ఇష్ట దైవం నిడిగుంట బీర లింగేశ్వర స్వామి, ఉజ్జనీ రాయస్వామి, వసరాయ స్వామి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవం మూడో రోజు ఆలయ అర్చకుడు ‘టెంకాయ పవాడం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల తలపై ఆ పూజారి టెంకాయలు పగులగొట్టడం చూస్తే ‘అరుంధతి’లోని సీన్ గుర్తుకురావాల్సిందే. దైవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది ఈ కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీగా వస్తోందట. భక్తులు తలపై టెంకాయలు కొట్టించుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.